హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోనూ అమలు కావాల్సిన అవసరం ఉన్నదని ఏపీలోని కాపునాడు మేధావుల విభాగం కన్వీనర్ డాక్టర్ గనిశెట్టి వెంకట శ్రీరామచంద్రమూర్తి అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరడంపై ఆయన స్పందించారు. కేసీఆర్ విజన్, నిబద్ధత కారణంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు.. ముఖ్యంగా రైతులు, బలహీన వర్గాలు అనేక సంక్షేమ ఫలాలు పొందుతున్నారని చెప్పారు.
ఏపీలో అలాంటి పరిస్థితి లేదని, కనీసం రాజధానిపై స్పష్టత లేదని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కేంద్రంలోని బీజేసీ సర్కారు విఫలమైందని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో ఏపీకి తోట చంద్రశేఖర్ వంటి నాయకుడు కావాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో వ్యవసాయ రంగంతోపాటు విద్యుత్తు, పరిశ్రమలు, ఐటీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలతో పాటు రైతులకు మేలుచేసేలా 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని వెల్లడించారు. ఎనిమిదేండ్లలో రైతుల అభివృద్ధి కోసం అనేక నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసినట్టు గుర్తు చేశారు.
ఏపీ మాత్రం అందుకు విరుద్ధంగా అనేక సమస్యలతో సతమతమవుతున్నదని, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలోని నాయకులు వ్యక్తిగత అభివృద్ధిపై ఎకువ దృష్టి సారించారని, రాష్ర్టాన్ని గాలికి వదిలేశారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో బీఆర్ఎస్ను స్వాగతించటం చారిత్రక అవసరమని గనిశెట్టి వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్లో చేరి ఏపీ పగ్గాలు చేపట్టడం ఆనందదాయకమని చెప్పారు. మోదీ సర్కారు ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలను సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అలాంటి నాయకుడే ఇప్పుడు ఏపీకి కావాలని పేర్కొన్నారు.