High Court | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మలాపూర్లోని వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న 77.30 ఎకరాలు దేవల్ బాలాజీ ఆలయానివేనని హైకోర్టు తేల్చింది. ఆ భూములపై తమకు హకులు ఉన్నాయని చెప్తున్న వాళ్లు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్లో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఆ భూములకు సంబంధించి దేవల్ బాలాజీ పేరుతో ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) జారీచేయడం చట్టబద్ధమేనని తీర్పులో పేరొన్నది.
మలాపూర్లో కోట్ల రూపాయల విలువైన 77.30 ఎకరాల ఇనాం భూములకు దేవల్ బాలాజీ ఆలయం పేరిట 2003లో చేవెళ్ల ఆర్డీవో ఓఆర్సీ జారీచేయడాన్ని, దాన్ని సమర్థిస్తూ 2006లో జాయింట్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇవ్వాడాన్ని సవాలు చేస్తూ శేరి నారాయణరెడ్డి సహా 22 మంది దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈ తీర్పు వెలువరించారు.