హైదరాబాద్, సెప్టెంబర్11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ లో బదిలీ ప్రక్రియ అంతు చిక్కడం లేదు. సొసైటీలోని నాలుగో తరగతి ఉద్యోగులకు గత జూలై 31న బదిలీల ప్రక్రియను పూర్తి చేసినా ఇప్పటివరకు ఉత్తర్వులను మాత్రం ఇవ్వడం లేదు. ఇదేమంటే ఆ బదిలీల ప్రక్రియను కలెక్టర్లకు అప్పగించామని సొసైటీ ఉన్నతాధికారులు చెబుతుండగా, తమకేమీ సంబంధం లేదని కలెక్టర్లు బదులిస్తుండటం కొసమెరుపు. దీంతో ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. సొసైటీలో నాలుగవ తరగతి ఉద్యోగులు దాదాపు 400మందికిపైగా ఉన్నారు. బదిలీ కోసం జూలై31న కౌన్సెలింగ్ నిర్వహించారు. నెలన్నర గడచినా ఎలాంటి ఉత్తర్వులను ఉన్నతాధికారులు వెలువరించలేదు. దీంతో సొసైటీలోని నాలుగవ తరగతి ఉద్యోగులందరూ ఆందోళనకు గురవుతున్నారు. బదిలీలు ఉన్నట్టా? లేనట్టా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ఎన్డీఎస్ఏ నుంచి తుది నివేదికను త్వరితగతిన తెప్పించేందుకు కృషిచేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో ఆయన బుధవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులపై వానకాలంలో నిర్వహించాల్సిన పరీక్షలన్నీ పూర్తిచేసి ఆ నివేదికను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి సమర్పించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆర్అండ్ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది