హైదరాబాద్ : బడ్జెట్ మొత్తం మోసమని, అన్ని వర్గాల ప్రజల చెవిలో కాంగ్రెస్ ప్రభుత్వం పువ్వులు పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్ మొత్తంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశమే లేదన్నారు. ఆరు గ్యారంటీల ఊసే తీయలేదని మండిపడ్డారు. కేవలం కుంభకోణాల కోసమే కాంగ్రెస్ సర్కారోళ్లు ఈ బడ్జెట్ పెట్టుకున్నరని ఆరోపించారు.
నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బడ్జెట్లో ఎలాంటి అంశం లేదని విమర్శించారు. రైతు భరోసాను ఇచ్చిన మాట ప్రకారం ఈ సారైనా ఎకరానికి రూ.15 వేలకు పెంచుతారని ఆశించామని, కానీ ఊసే తీయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆఖరికి ఆ రూ.12 వేల చొప్పున కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పలేదని ధ్వజమెత్తారు. రైతులకు ఏడాదికి రూ.12 వేల అంశం కూడా ఉత్తమాటగానే మిగిలిపోయిందని విమర్శించారు.
ఇక మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్రెడ్డితోసహా కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేశారని, కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఆడబిడ్డలను దగా చేయడమేనని మండిపడ్డారు. వృద్ధ్యాప్య పించన్లు, వికలాంగ పించన్ల విషయంలో కూడా ప్రభుత్వం మాటతప్పిందని విమర్శించారు. వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులు రూ.6 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహించారు.