హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలోని కాజీపేట నుంచి అటు బల్హార్ష, ఇటు విజయవాడ లైన్లలో చేపట్టిన మూడో రైల్వేలైన్ల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి 421 కిలోమీటర్లకు కోసం మొత్తం రూ.4,015 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఇందులో కాజీపేట-విజయవాడ మూడో రైల్వే మార్గం కోసం 2012-13లో నిధులు కేటాయించారు. కాజీపేట-బల్హార్ష సెక్షన్ మూడో లైన్ ప్రాజెక్టు కోసం 2015-16లో మంజూరు చేశారు. నాటి నుంచి ఆయా మార్గాల్లో మూడో లైన్ల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతున్నది. ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనకకు అన్న చందంగా పనులు కొనసాగుతున్నాయి. అత్యంత రద్గీగా ఉండే కాజీపేట-బల్హార్ష, కాజీపేట-విజయవాడ మార్గాల్లో మూడో లైన్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడమే లేదు. సమాంతరంగా చేపట్టాల్సిన విద్యుద్దీకరణ పనులు కూడా సక్రమంగా జరగడం లేదు.
బల్హార్ష మార్గంలో పెండింగ్లో 51 కి.మీ. పనులు
కాజీపేట-బల్హార్ష సెక్షన్ మధ్యలో 202 కిలోమీటర్లు మేర మూడో రైల్వే లైన్ నిర్మించాల్సి ఉన్నది. అందులో తెలంగాణ ప్రాంతంలో 159 కిలోమీటర్లు, మహారాష్ట్ర పరిధిలో 43 కిలో మీటర్ల వరకు మూడో లైను, విద్యుద్దీకరణ పనులు పూర్తిచేయాలి. ఈ ప్రాజెక్టు కోసం 2015-16లో రూ.2,063 కోట్ల నిధులు కేటాయించారు. తొలుత 2020లో కేవలం 22.8 కిలోమీటర్ల మేరకు పూర్తి మూడో లైన్ పనులను పూర్తి చేశారు. అనంతర తొమ్మిదేండ్ల కాలంలో కేవలం 131 కిలోమీటర్లు మాత్రమే మూడో లైన్ పనులను పూర్తి చేసినట్టు రైల్వే అధికారుల ద్వారా తెలిసింది. ఈ సెక్షన్లో ఇంకా 51 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ఈ రెండు రాష్ర్టాలకు కలిపి ఇప్పటివరకు 150.96 కిలోమీటర్లు మాత్రమే ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేశారు. అందులో తెలంగాణ రాష్ట్రం పరిధిలో 114.96 కిలోమీటర్లు, మహారాష్ట్ర పరిధి 37 కిలోమీటర్ల మేర పూర్తి చేసినట్టు తెలిపారు.
సగమైనా పూర్తికాని విజయవాడ లైన్
కాజీపేట-విజయవాడ సెక్షన్ పరిధిలో మొత్తం 219 కిలోమీటర్ల వరకు మూడో రైల్వే లైన్, విద్యుద్దీకరణ ప్రాజెక్టు నిర్మాణానికి 2012-13లో మంజూరు చేశారు. అందుకోసం బడ్జెట్లో రూ.1,952 కోట్ల నిధులు కేటాయించారు. ఈ ప్రాజెక్టు మంజూరై ఇప్పటివరకు దాదాపు 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటివరకు కేవలం 86.56 కిలోమీటర్ల మేరకే మూడో లైను, విద్యుద్దీకరణ పనులను పూర్తి చేశారు. ఇంకా 132.44 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేయాల్సి ఉన్నది. మిగతా పనుల పూర్తికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియని అయోమయం నెలకొన్నది.