Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ‘కేసు మా వాడి మీద కూడా పెట్టండి’ అని ఒకరు ఒత్తిడి తెస్తే, ‘ముందు ఆయన సంగతి తేల్చాకే నా దాకా రండి’ అని ఇంకొకరు ఒత్తిడి చేస్తారు. ఇద్దరూ అధికార పార్టీ ముఖ్యులే! దీంతో ఏం చేయాలో తెలియక పోలీసు ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు. అధికార పార్టీ ముఖ్య నేతల మధ్య విభేదాలు ఇప్పుడు సిటీ పోలీసు ఉన్నతాధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దాదాపు వారం రోజుల క్రితం మల్కాజిగిరి ప్రాంతంలో జరిగిన సంఘటనే దీనికి కారణం. విశ్వసనీయవర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం… మల్కాజిగిరి- ఘట్కేసర్ ప్రాంతాల్లో, ఒక వ్యక్తి ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని, ప్రజలను మోసగిస్తున్నట్టు వారం పది రోజుల క్రితం ఎస్వోటీ పోలీసుల దృష్టికి వచ్చింది. వారు ఆ ముఠాపై నిఘా వేసి ఉంచారు. ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగం పెట్టిస్తానని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని, గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయిస్తానని చెప్తూ ఈ ముఠా 1.29 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు ఎస్వోటీ పోలీసుల విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకు సన్నిహితుడైన ఒక వ్యక్తి పేరును, హోదాను వాడుకోవడం ద్వారా ఈ ముఠా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ముఠా అధికార పార్టీకి చెందిన దక్షిణ తెలంగాణ ఎంపీ పేరును కూడా వాడినట్టు గుర్తించారు. ఈ ముఠా నాయకుడు కొద్ది రోజుల క్రితం ఒక కాంట్రాక్టర్‌కు రూ. 25 కోట్ల బిల్లును ఒకేఒక్క రోజులో క్లియర్ చేయించాడట. ఎట్లా చేయించాడు? ఎవరి సాయం తీసుకున్నాడు? అన్నది రహస్యం.
అనూహ్య రీతిలో బిల్లు క్లియర్ చేయించడంతో అతడు అధికార పార్టీ నేతలకు సన్నిహితుడనే నమ్మకం అందరికీ కలిగింది. దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్యుల పేరు చెప్పి ఒకట్రెండు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కూడా పెట్టించాడట. బదిలీల కోసం కొందరు ఉద్యోగులను ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా కలిపించాడట. వీటిన్నింటినీ చూసి నమ్మకం కుదిరిన పలువురు ఇతరత్రా పనుల కోసం ఆ ముఠా నేతకు డబ్బులు సమర్పించుకున్నారు. అయితే ఆ పనులను ఆయన చేయించలేకపోయాడు. దీంతో మోసకారి అన్న విషయం బయటపడింది. మోసపు సంపాదనలో ఎక్కువ భాగాన్ని ముఠా నాయకుడే తీసుకోవడం (దాన్ని బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. అది వేరే సంగతి!)తో గ్యాంగ్ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తి మోసాల సంగతి బయటకు పొక్కడంతో ఎస్వోటీ పోలీసులు నిఘావేసి ముఠాను అనధికారికంగా వారం పది రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు. అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. ముఠా పట్టుబడడం, కాంగ్రెస్ పెద్దల పేర్లు ప్రస్తావనకు రావడంతో విషయం పైదాకా వెళ్లింది. ఒక్కరోజులో బిల్లు పాసైన వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అని భయపడ్డ ఒక పెద్దాయన వెంటనే రంగంలోకి దిగి, ముఠాతో పాటు, వారి సంభాషణల్లో ప్రస్తావనకు వచ్చిన, తన ప్రత్యర్థి శిబిరంలో ఉన్న కీలక వ్యక్తిపై కూడా కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారట. తద్వారా విషయం డైవర్ట్ అవుతుందనీ, తన ప్రస్తావన లేకుండా చర్చ అటువైపు మళ్లుతుందన్నది ఆయన ఎత్తుగడ. కేసు మరీ సీరియస్ అయితే తను సేఫ్, అతడు ఎగిరిపోతాడు, వన్‌షాట్ టు బర్డ్స్ అని ఆయన అంచనా వేసాడు.
అయితే సదరు కీలక వ్యక్తి కాంగ్రెస్ ప్రముఖుడికి సన్నిహితుడు కావడంతో పోలీసులు తటపటాయించి విషయాన్ని ఆయన దృష్టికీ తీసుకుని వెళ్లారట. దీంతో కలవరపడ్డ ఆయన, ముఠా నా పేరు ప్రస్తావిస్తేనే నా మీద కేసు నమోదు చేసేటట్లయితే, మరి ఒక్కరోజులో అంత బిల్లు ఎట్లా పాసైందో కూడా ఆరా తీయండి. దాని వెనక ఎవరున్నారో వారిపైనా కేసులు నమోదు చేయండి అని ఒత్తిడి తెచ్చారట. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సంకటంలో పడ్డారు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారింది వారి పరిస్థితి. ఈ ఫ్రస్ట్రేషన్‌లోనే ఒక ఉన్నతాధికారి కిందిస్థాయి అధికారులకు ఫోన్ చేసి, వెనకాముందూ చూసుకోకుండా, ఎవడినిపడితే వాడిని పట్టుకొచ్చి, ఏది పడితే అది రికార్డు చేయడమేనా? అని చెడామడా తిట్టిపారేశారట. తర్వాత ఎస్వోటీ పోలీసులు ముఠాను తమదైన శైలిలో విచారించి, కొందరు బాధితులను వెతికి పట్టుకుని, ఇద్దరు ప్రముఖుల ప్రస్తావనేదీ లేకుండానే, సాదాసీదా ఫిర్యాదు తీసుకుని, రెండు వేర్వేరు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేయించారట. ముఠా మోసం కన్నా బయటకు వచ్చిన కాంగ్రెస్ ముఖ్యుల విభేదాలు, పరస్పరం కేసులు పెట్టించుకోవడానికి వారు తెచ్చిన ఒత్తిడి ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు ముఖ్యులు తమను కాపాడుకోవడానికి ఎదుటి ప్రముఖుడిని ఇరికించే ప్రయత్నం చేయడంమీద పోలీసు వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు పోలీసులు నోరు విప్పడం లేదు. చివరికి ఫిర్యాదు ఇచ్చిన బాధితులు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. అసలేం జరిగిందని పోలీసు ఉన్నతాధికారులను ఆరాతీస్తే వారు అవసరానికి మించి సీరియస్ అవుతున్నారు. అంత కోపం ఎందుకో. విషయం ఎలా బయటకు పొక్కిందనేనా?