హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): గౌడ కులస్థుల ఆత్మగౌరవం, గీత కార్మికులకు ఉపాధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా కేఫ్‌ను గౌడన్నలకే కేటాయించాలని గౌడ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేఫ్‌ను ధ్వంసం చేసిన శంకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఈ నెల 17న ‘గౌడన్నల చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్‌లో శనివారం గౌడ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా నీరా కేఫ్‌ను గౌడ కులస్థులకే ఇవ్వాలని గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్నగౌడ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సంక్షేమాన్ని నాశనం చేస్తున్నదని విమర్శించారు. తమ కులానికి సంబంధం లేని వారికి కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని చూస్తే నీరా కేఫ్‌ను నిర్వీర్యం చేసే కుట్ర జరగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలను లెకచేయని టూరిజం ఎండీని సస్పెండ్ చేయాలని గౌడజన హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్ డిమాండ్ చేశారు. బినామీ శంకర్‌రెడ్డితో కలిసి లోపాయికారి ఒప్పందం ప్రకారం మంత్రి ఆదేశాలను లెక్క చేయడం లేదని ఆరోపించారు. గీత కార్పొరేషన్ సంస్థకు నీరా కేఫ్ దకకుండా కుట్ర చేస్తూ శంకర్‌రెడ్డిని ప్రోత్సహిస్తున్నట్టు అనుమానం ఉన్నదని తెలిపారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే విధంగా అతన్ని రెచ్చగొడుతున్నాడని చెప్పారు. బేషరతుగా గీత కార్పొరేషన్ సంస్థకు నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని, లేనిపక్షంలో చలో హైదరాబాద్ నిర్వహించడంతో పాటు అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో గౌడ్స్క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ చెక్కిళ్ల మధుసూదన్‌గౌడ్, గౌడ్స్ బిజినెస్ నెట్వర్క్ ప్రెసిడెంట్ చీకటి ప్రభాకర్‌గౌడ్, గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వంగా సదానందంగౌడ్, గోపా ఆర్గజైనేషన్ సెక్రటరీ ఎలమకంటి వీరయ్యగౌడ్, మహేశ్‌గౌడ్, భవానీగౌడ్, పగడాల లక్ష్మణ్‌గౌడ్, అమర్నాథ్గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, రాజుగౌడ్, పవన్‌గౌడ్, భాస్కర్‌గౌడ్, విజయ్కాంత్గౌడ్, నరేశ్‌గౌడ్, శ్వేతాగౌడ్, మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నీరా కేఫ్ భవనంలో గౌడ ప్రతిమలు తొలగించి, చెట్లు నరికేసి, లేవ్వ్యూ అనే పేర్లతో ఫుడ్‌కోర్టు బోర్డులు పెట్టి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన శంకర్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ పోలీస్‌స్టేషన్‌లో శంకర్‌రెడ్డిపై ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే ఎస్‌హెచ్‌వో బుర్ర చిట్టి ఫిర్యాదు తీసుకోలేదని వారు తెలిపారు. ‘పైఅధికారులను అడిగి, వారితో మాట్లాడి చెప్తా’ అంటూ తమను బయటికి పంపారని చెప్పారు. కనీసం ఫిర్యాదు ఇచ్చినట్టు ఫొటోలకు కూడా అవకాశం ఇవ్వకుండా, తమ ఫోన్లను లోనికి అనుమతించలేదని తెలిపారు. దీని వెనుక పెద్దల హస్తం ఉన్నదని గౌడ సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు శంకర్‌రెడ్డిపై కేసు నమో దు చేసే వరకు వెనుకాడేదిలేదని గౌడ సంఘాల నేతలు తేల్చిచెప్పారు.