హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : “మన సంస్కృతితో కూడిన పుస్తకాల ఆధారంగానే పిల్లలకు మన చరిత్రను, వైభవాన్ని, మనదైన జీవన విధానాన్ని పరిచయం చేయగలం” ఇదే కోవలో బీఆర్ఎస్ సర్కారు రూపొందించిన తెలుగు వాచకాలను పలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లు అటకెక్కిస్తున్నాయి. ఇంగ్లిష్ మోజులో తెలుగు పుస్తకాలను బోధించడం లేదు. కొన్ని స్కూళ్లు తెలుగు వాచకాలను వాడకపోగా, మరికొన్ని ఒక పుస్తకానికి బదులు ఇతర పుస్తకాలను వాడుతున్నాయి. మన పిల్లలకు తెలంగాణ యాస, భాషను దూరం చేస్తున్నా రు. కొన్ని విద్యాసంస్థలు తెలుగుకు ద్రోహం తలపెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మభాష ఆదరణకు నోచుకోకపోయినా అధికారులు అలసత్వం వీడడంలేదని విద్యావేత్త లు, భాషాభిమానులు మండిపడుతున్నారు.
తెలుగుకు కేసీఆర్ వెలుగులు
బీఆర్ఎస్ ప్రభుత్వం 2018-19లో తెలు గు తప్పనిసరి అమలు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం స్కూళ్లలో ఇంగ్లిష్తో పాటు ఇతర మీడియం విద్యార్థులు తెలుగును తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉన్నది. 2018-19లో విద్యాసంవత్సరంలో ప్రాథమికస్థాయిలో 1వ తరగతిలో, ఉన్నతస్థాయిలో 6వ తరగతిలో తెలుగును అమలు చేశారు. ఇలా ఏడాదికి ఒక తరగతికి పెంచుకుంటూ వెళ్లారు. కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం తెలంగాణ భాష, యాసతో తెలుగు పుస్తకాలను ముద్రించి, అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టాండర్డ్ తెలుగు (తెలుగు భాష) తీసుకున్న వారి కోసం జాబిలి, నవవసంతం, సింగిడి పుస్తకాలను రూపొందించింది. ఇక కేవలం తెలుగును పరిచయం చేయడం కోసం, అది కూడా తెలుగేతర మీడియాల్లో చదువుతున్న వారి కోసం వెన్నెల, తేనెపలుకులు పుస్తకాలను ముద్రించింది.
ఒకదానికి బదులు మరోటి
సీబీఎస్ఈ స్కూళ్లల్లో 1-8 తరగతుల వరకు త్రిభాషా సూత్రం, 9, 10 తరగతుల్లో ద్విభాషా సూత్రం అమలవుతున్నది. అయితే 1-8 తరగతుల్లో కొందరు హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్/జర్మన్ వంటి భాషలు తీసుకుంటున్నారు. మరికొందరు ద్వితీయభాషగా తెలుగును తీసుకుంటున్నారు. ద్వితీయభాషగా తెలుగును తీసుకున్న వారు 1-5 తరగతుల్లో జాబిలి, 6-8తరగతులకు నవ వసంతం, 9, 10 తరగతులకు సింగిడి పేరుతో గల పుస్తకాలు చదవాల్సి ఉంది. అయితే తెలుగును చదవని వారు మాత్రం తప్పనిసరి తెలుగు అమల్లో భాగంగా మూడో భాషగా తెలుగు ను చదవాల్సి ఉంటుంది. ఇలాంటి వారు 1-5 తరగతుల్లో వెన్నెల, 6-10 తరగతుల్లో తేనెపలుకులు పుస్తకాలను చదవాలి. వీటిని సింపుల్ తెలుగు పుస్తకాలంటారు.
అయితే పలు సీబీఎస్ఈ పాఠశాలల్లో రెండోభాషగా తీసుకున్న విద్యార్థులకు జాబిలి, నవవసంతం, సింగిడి పుస్తకాలకు బదులుగా మూ డోభాషగా తెలుగు తీసుకున్న విద్యార్థుల కోసం రూపొందించిన వెన్నెల, తేనెపలుకు లు పుస్తకాలను వాడుతున్నారు. ఇలా చేయడమంటే తెలుగు భాషకు తీరని ద్రోహం చేయడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.సబ్జెక్టు కోడ్ కేటాయించిన సీబీఎస్ఈసీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డు స్కూళ్లల్లో సింపుల్ తెలుగుకు వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమయ్యింది. వెన్నెల (సింపుల్ తెలుగు) పుస్తకానికి సీబీఎస్ఈ లాంగ్వేజ్ గ్రూప్ -ఎల్లో 089 సబ్జెక్టుకోడ్ను జారీచేసింది. దీంతో 2025-26 విద్యాసంవత్సరంలో 9వ తరగతికి, 2026- 27 విద్యాసంవత్సరంలో పదో తరగతికి వార్షిక పరీక్షలను నిర్వహిస్తారు. వార్షిక పరీక్షలను నిర్వహించనుండటంతోనైనా తప్పనిసరి తెలుగు సక్రమంగా అమలుచేసేనా.. ? పాఠశాల విద్యాశాఖ సరైన పర్యవేక్షణ జరుపుతుందా..? లేదా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.