Lagacharla | మహబూబ్‌నగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అది భూమిపుత్రుల పోరాటం.. నిద్రాహారాల్లేవ్.. నోటికాడ కూడును లాగేసుకుంటున్న సర్కారుపై తిరగబడ్డ గిరిజన రైతులు వాళ్లు.. ఓట్లేసి గెలిపించి సీఎంను చేస్తే ఇప్పుడు ఏకంగా తొండలు గుడ్లుపెట్టని భూములే సేకరిస్తున్నారని వేములవాడ సాక్షిగా చెప్పిన మాట అబద్ధమని లగచర్ల గొంతెత్తుతున్నది. అభివృద్ధి మాటున కనిపించని కుట్రను ధైర్యంగా ఎదిరిస్తోంది. లగచర్ల భూములు ఎందుకు పనికిరానివంటూ సీఎం చేసిన కామెంట్లపై ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలను ఆనుకొని ఉన్న దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ కోసం ప్రభుత్వం చేస్తున్న భూసేకరణ చేస్తున్నది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తొమ్మిది నెలలుగా ఆ ప్రాంత రైతులు నిద్రాహారాలు మాని ఆందోళన బాట పట్టారు. రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నమ్మి బ్యాంకుకు పాసుబుక్కు తీసుకెళ్తే రైతన్నకు గుండె పగిలే చేదు నిజం బయటపడింది. ‘మీ భూములన్నీ సర్కారు తీసుకుంటుంది.. సర్వే నెంబర్లన్నీ బ్లాక్ చేశాం’ అని బ్యాంక్ అధికారులు చెప్పడంతో కంగుతిన్నారు.
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం పోలేపల్లి, హకీంపేట, పులిచర్ల తండా, లగచర్ల, రోటిబండ తండాల్లో ఫార్మా కంపెనీ కోసం సుమారు 1,365 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ ప్రాంతంలో ఫార్మా క్లస్టర్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతిపాదనలు సిద్ధం చేసిన భూములన్నీ గిరిజనులు సాగు చేస్తున్నవి. ఈ భూముల్లో పండిన గింజలను తింటూ గిరిజనులు బతుకు వెళ్లదీస్తున్నారు. అలాంటి భూములపై సర్కారు కన్నేసింది.
భూసేకరణ చేస్తున్న ప్రాంతాల్లో అంగుళం భూమిని వదలకుండా సాగు చేస్తున్నారు. వర్షాధార పంటలకు నిలయమైన ఈ ప్రాంతంలో గత ప్రభుత్వాలు సరైన ముందు చూపులేకపోవడంతో భూములన్నీ సాగుకు నోచుకోలేదు. తెలంగాణ వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న మిషన్ కాకతీయ పథకంలో చెరువులు కుంటలు బాగుఅయ్యాయి. కరువును ముద్దాడిన కొడంగల్ జలసిరితో కళకళలాడింది. కాకరవాణి ప్రాజెక్టు, బొంరాస్‌పేట పెద్ద చెరువు, ఇతర గొలుసు కట్టు చెరువులన్నీ నిండిపోయాయి. కోస్గి నుంచి తుంకిమెట్లకు వెళ్లే రహదారిలో పోలేపల్లి దాటగానే కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పంట భూమిలే కనిపిస్తున్నాయి.
సీఎం సొంత నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు అధికారులు యుద్ధప్రాతిపదికన ఫైళ్లు కలుపుతున్నారు. కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో పేదల భూములను లాక్కొనే ప్రయత్నం ప్రారంభమైంది. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే సాగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు చెబుతున్నారు. కేవలం సీఎం నియోజకవర్గం కావడమే ఈ ప్రజలు చేసుకున్న శాపమని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఫార్మా క్లస్టర్ వల్ల తమ పొలాలు కాలుష్యం బారిన పడతాయని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న పొలాలను సర్కారుకిచ్చి కుటుంబాలతో తామంతా ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ‘మేం పెద్దగా చదువుకోలేదు.. ఫార్మా కంపెనీల్లో బాత్రూంలు కడగడానికి.. కాపలాకు తప్ప మరే ఉద్యోగాలు మాకు దొరకవు.. ఉన్న భూముల్లో ఎవుసం చేసుకుంటూ సాఫీగా సాగుతున్న మా బతుకులకు బాత్రూంలు కడిగే ఉద్యోగం కల్పిస్తారా? అంటూ సీఎంనే ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం పీఠం ఎక్కితే అభివృద్ధికి బాటలు పడుతాయని ఊహించిన జనాలు ఉన్నది పోతుండడంతో నెత్తి నోరు మొత్తుకుంటున్నారు.
దుద్యాల మండలంలో రహదారి వెంట ఉండే పొలాలు ఎకరాకు రూ.కోటి ధర పలుకుతున్నాయి. రోడ్డుకు కొంచెం లోపల రూ.60 నుంచి రూ.70 లక్షలు ఎకరా ఇస్తామంటే అమ్మడానికి రైతులు సిద్ధంగా లేరు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కసారి వచ్చి చూడాలని .. ఇవి పసిడి పంటలు పండించే భూములని సోషల్ మీడియా వేదికగా గొంతెత్తుతున్నారు. ఎక్కడ భూములుపోయినా బడుగు బలహీన వర్గాలువే అంటూ సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి.