హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ గతంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)ని తెచ్చిందని, దానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను అమలు చేస్తున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో శనివారం సమాజ్‌వాదీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజన్ ఇండియా ఏఐ సమ్మిట్’లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. రాజకీయాలు అంటే విజన్ అని డివిజన్ కాదని బీజేపీకి చురకలు అంటించారు.
బీజేపీ కోసమే ఎలక్షన్ కమిషన్ ఓట్లను తొలగిస్తున్నదని ఆరోపించారు. ఓటర్ల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచాల్సిన ఈసీ బీజేపీ కోసం ఉన్నవారిని తొలగించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్తో ఒక్క యూపీలోనే మూడు కోట్ల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. టెక్నాలజీని వినియోగించుకుని ప్రజల్లో బీజేపీ వైషమ్యాలు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. సాంకేతికతను దుర్వినియోగం చేసి బీజేపీ యూపీలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని నిప్పులు చెరిగారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుండటంతో ఆధార్‌ను నకిలీ చేసే చాన్స్ ఉన్నదని, డెబిట్, క్రెడిట్ కార్డులను నకిలీ చేసే అవకాశం లేదని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం ఆధార్ నకిలీ కాకుండా ఉండేందుకు కొత్తగా ఆధార్ మెటల్ కార్డులను ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు. ఓటరు లిస్టుతో ఆధార్ కార్డును ఎందుకు అనుసంధానం చేయడం లేదో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు.
సమానత్వం, సామాజిక పరివర్తనకు ఏఐని వినియోగించాలి
అన్ని రంగాలపై కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావం చూపుతున్నదని.. వ్యవసాయం, ఆరోగ్యరంగం, ట్రాఫిక్ సమస్య, విద్యుత్తు, వాటర్ మేనేజ్మెంట్, ఎయిర్ క్వాలిటీ, సహా మౌలిక వసతుల్లో ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని అఖిలేశ్‌యాదవ్ సూచించారు. విజన్ ఇండియా సమ్మిట్ ద్వారా అందరికీ కలిసి పనిచేసే వేదికను అందించామని చెప్పారు. భారత్‌ను ‘నియో ఇండియా’గా మార్చే లక్ష్యానికి ఈ కార్యక్రమం ఓ కీలక ముందడుగుగా నిలుస్తుందని తెలిపారు. ఏఐ వచ్చాక ఉద్యోగాల కల్పనలో గణనీయంగా మార్పులు వచ్చాయని, యువత కోసం కొత్త కోర్సులను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ మానవ భావోద్వేగాలు, సంబంధాలను బలపరిచి, మానవ ఆలోచనలను సానుకూలంగా మార్చగలిగితే వివక్ష రూపుమాపే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ భారతాన్ని ఏఐతో ఎలా అనుసంధానం చేస్తామనేదే మన ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు.
ప్రగతిశీల భారత్ లక్ష్యంగా ‘విజన్ ఇండియా సమ్మిట్’
విజన్ ఇండియా సమ్మిట్ సిరీస్‌తో భారత ప్రగతిశీల, నిర్మాణాత్మక అభివృద్ధి ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని అఖిలేశ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో నెగెటివిటీ తీవ్రస్థాయికి చేరిందని, కులం, మతం ఆధారంగా ప్రజలను వేధించడం సరికాదని బీజేపీపై మండిపడ్డారు. ఏఐ సాంకేతికత మంచి మార్గాన్ని నిర్దేశించేలా ఉండాలని ఆకాంక్షించారు. ఏఐ దుర్వినియోగం నుంచి ఎలా బయట పడాలో చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సాంకేతికత కారణంగా పాస్‌వర్డ్‌లకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తంచేశారు.
యూపీలాంటి పెద్ద రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, సామాన్యులతోపాటు, ఐఏఎస్, జడ్జీలు, బడా వ్యాపారవేత్తలు సైతం సైబర్ నేరస్తుల బాధితులే అని తెలిపారు. డీప్ ఫేక్, ఏఐ జనరేటివ్ వీడియోల దుర్వినియోగంతో వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీలో అధికారంలోకి వచ్చాక ఏఐని వినియోగించుకుని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడతామని స్పష్టం చేశారు. బీహార్ ఫలితాల తర్వాత కూడా ఇండి కూటమిలో కొనసాగుతారా..? అన్న ప్రశ్నకు బీహార్‌లో తాము ఆశించిన మేరకు ఫలితాలు రాలేదని, అయినా.. ఇండి కూటమిలో తాము కొనసాగుతామని అఖిలేశ్ స్పష్టంచేశారు.