హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీ టెండర్లకు స్పందన అంతంత మాత్రంగానే లభించింది. నిరుటి బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు పెద్దగా ముందుకు రాలేదు. దీంతో 5 జిల్లాలకు కనీసం ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. ఇక మిగిలిన జిల్లాలకు కూడా నామమాత్రంగానే టెండర్లు దాఖలైనట్టు తెలిసింది. ఈ ఏడాది హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో ఉచితంగా 85 కోట్ల చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ గతంలో రెండుసార్లు టెండర్లను పిలిచింది. అప్పట్లో కేవలం 3 టెండర్లు మాత్రమే రావడంతో మరోసారి టెండర్లను ఆహ్వానించి, ఈ నెల 13 వరకు గడువు ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో టెండర్లను ఓపెన్ చేసింది. వాటిలో మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలకు కనీసం ఒక్క టెండరు కూడా రాలేదని తెలిసింది. మిగిలిన 27 జిల్లాలకు 84 టెండర్లు దాఖలైనట్టు సమాచారం. అంటే.. సగటున ఒక్కో జిల్లాకు 3 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏకంగా 140 టెండర్లు వచ్చాయి. ఈ ఏడాది టెండర్లు తక్కువ దాఖలవడంతో చేపల పిల్లల కొనుగోలు ధర పెరగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టెండర్లు రాని జిల్లాలను పక్క జిల్లాల టెండర్దారులకు అప్పగించాలని మత్స్యశాఖ యోచిస్తున్నట్టు తెలిసింది.
ఆగస్టు పూర్తయింది.. పంపిణీ ఎప్పుడు?
వాస్తవానికి ఈ ఏడాది ఇప్పటికే చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేయాల్సి ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా టెండర్లకే పరిమితమవడంతో ఈ ప్రక్రియ పూర్తయ్యేదెప్పుడు? చేపపిల్లల పంపిణీని ప్రారంభించేదెప్పుడు? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమయం మించిపోయిందని, మరింత ఆలస్యమైతే చేపపిల్లల పెరుగుదలపై ప్రభావం పడి లాభాలు తగ్గుతాయని మత్స్యకారులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక చొరవతో టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి, చేపపిల్లల పంపిణీని ప్రారంభించాలని కోరుతున్నారు.
రొయ్యపిల్లల పంపిణీకి స్వస్తి
ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం రొయ్యపిల్లల పంపిణీకి స్వస్తి పలికింది. నిరుటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపపిల్లలతోపాటు రొయ్యపిల్లలను కూడా పంపిణీ చేసింది. కానీ, ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం రొయ్యపిల్లల పంపిణీకి టెండర్లు పిలవలేదు. దీంతో ఈసారి పంపిణీ లేనట్టేనని మత్స్యశాఖ వర్గాలు చెప్తున్నాయి.