హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగులు ఎవరూ ఒత్తిడికి లోనుకావడం లేదని, చనిపోయిన వారంతా వ్యక్తిగత కా రణాలతోనే చనిపోయారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఆర్టీసీలో రోజుకు 16 గంటల డ్యూటీ కాకుండా 8 గంటల పని విధానమే అమలుచేస్తున్నట్టు వెల్లడించింది. మహాలక్ష్మి సర్వీసులతో ఎలాంటి ఓవర్‌లోడ్ లేదని చెప్పింది. ఈ మేరకు సో మవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంస్థలో రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారని, ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని ‘నమస్తే తెలంగాణ’ సోమవారం వార్తా కథనం ప్రచురించింది. అయితే, అవన్నీ అవాస్తవమని యాజమాన్యం ఖం డించింది. మొత్తంగా ఒకొకరికి వారానికి 48 పని గంటలు మించవని స్పష్టంచేసింది. సాధారణ డ్యూటీ 8 గంటలకు తో డు మరో మూడున్నర గంటలు మాత్రమే ఓటీ ఉంటుందని తెలిపింది. సిబ్బంది రెండు షిఫ్ట్‌ల్లో వరుసగా విధులు నిర్వర్తిస్తే మరుసటి రోజు ఆ ఉద్యోగులకు స్పెషల్ ఆఫ్ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ డ్యూటీలను రద్దీకి అనుగుణంగా మాత్రమే కేటాయిస్తున్నట్టు తెలిపింది. జీవో-8 ప్రకారం విద్యార్హత కలిగిన డ్రైవర్లను హై ఎండ్ బస్సుల్లో మాత్రమే డ్రైవర్ కమ్ కండక్టర్‌గా వినియోగిస్తున్నామని పేర్కొన్నది.
ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర ; 20నుంచి 22 వరకు సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలు
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఇప్పటికీ ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించకపోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సీపీఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ మలాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలోని మహారాజ గార్డెన్స్‌లో ఈనెల 20నుంచి 22వరకు మూడ్రోజులపాటు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మహాసభల్లో 743మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోనున్నామని పేర్కొన్నారు. హామీలను అమలు చేయాలని డిమాండ్‌చేశారు.