కరీంనగర్ కలెక్టరేట్, జూలై 19: రాష్ట్రంలో రానున్న రోజుల్లో తాగునీటికీ ఇబ్బందులు తప్పవని, నీటి వినియోగంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఎల్ నినో ప్రభావం అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నదని, ఇప్పటికే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయినట్టు చెప్పారు. రాష్ట్రంలోని సాగర్, ఎస్సారెస్పీ తదితర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు డెడ్‌స్టోరేజీకి పడిపోయాయని తెలిపారు. ఈ మేరకు ఎల్ నినో ప్రభావ తీవ్రతపై అవసరమైన ప్రణాళికలు రూపొందించే క్రమంలో ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన ఆయన ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం మంత్రి మీడియాతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్ననీళ్లను తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని చెప్పారు. రైతాంగం ఆరుతడి పంటలపై దృ ష్టి సారించాలని సూచించారు. ప్రతి జిల్లా లో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటుచేసి విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నట్టు మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. భూగర్భజలాలు కాపాడేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నా రు. నీటిని సక్రమంగా వినియోగించుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సమావేశం లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, సీహెచ్ విజయరమణారావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్‌కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కన్నెపల్లి మోటర్లు ఆన్‌చేయండి: కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కన్నెపల్లి పంపుహౌస్ నుంచి మోటర్ల ద్వారా కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మంత్రులను కోరారు. ఎక్కడ కూడా ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, కాళేశ్వరం ఒక్కటే ఎల్ నినోకు పరిష్కారమని చెప్పారు.