హైదరాబాద్, మార్చి15 (నమస్తే తెలంగాణ): గురుకుల నియామకాల్లో వెయిటింగ్ లిస్టు విధానం లేదని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) చైర్మన్ ఆయేషా మస్రత్ ఖానం శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. భర్తీ కాని, అభ్యర్థులు జాయిన్ కాకపోవడం వల్ల ఏర్పడే ఖాళీలను క్యారీఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని తేల్చిచెప్పారు. గురుకుల పోస్టుల భర్తీ విధానంపై ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ట్రిబ్ చైర్మన్ స్పందించారు. ఆరోపణలను ఆ ప్రకటనలో కొట్టిపడేశారు. గురుకుల బోర్డు ద్వారా చేపట్టిన నియామకాలు 100శాతం పారదర్శకంగా, నిబద్ధతతో కొనసాగాయని తెలిపారు. వివిధ మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. అవకతవకలకు తావు లేకుండా డీఎల్, జేఎల్ ఫలితాలను ఇచ్చామని స్పష్టంచేశారు. డీఎల్, జేఎల్ 1:2 లిస్టును ఫిబ్రవరి 15,16వ తేదీల్లో ప్రకటించామని, డెమోలను ఫిబ్రవరి19 నుంచి 22వరకు నిర్వహించామని వివరించారు. ఫిబ్రవరి 28న డీఎల్, 29న జేఎల్ ఫలితాలను వెల్లడించామని చెప్పారు. అనుమానాలకు తావివ్వకుండానే మార్చి 4న అభ్యర్థులకు నియామక పత్రాలను అందించామని పేర్కొన్నారు. నిబంధనల మేరకు అన్ని రిజర్వేషన్లు పాటిస్తూ, మధ్యవర్తులను పైరవీకారులకు అవకాశం ఇవ్వకుండా, పారదర్శకంగా, అభ్యర్థులకు ఏవిధమైన ఇబ్బంది కలగకుండా నియామకాల ప్రక్రియ మొదలుపెట్టి అతి తకువ కాలంలోనే ఫలితాలను ప్రకటించామని వెల్లడించారు.
అర్హులైన అభ్యర్థులకు మార్కుల మెమో
నోటిఫికేషన్‌లోని పేరా 11 (ఏ) ప్రకారం మారుల మెమోలను నెల రోజుల తర్వాత నుంచి 90 రోజుల వరకు ట్రిబ్ వెబ్సైట్లో పొందుపరుస్తామని స్పష్టంచేశారు. ఆన్లైన్ రూ.200 పే చేస్తే, అదీ అర్హులైన అభ్యర్థులకు మాత్రమే మారుల మెమో అందజేస్తామని తెలిపారు. డెమో నిబంధనలను పాటించామని, అభ్యర్థులకు వైట్ బోర్డులు, మారర్ పెన్నులు, డెమోకు అవసరమైన వాటిని ప్రతి బోర్డులో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఏ బోర్డులో ఎవరు ఉంటారనే విషయాన్ని, ఏ అభ్యర్ధులు ఏ బోర్డుకు వెళ్తారనే అంశాన్ని చివరి నిమిషంలోనే నిర్ణయించడంతోపాటు, అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను తెలపకుండా కేవలం హాల్‌టికెట్ల నంబర్లను మాత్రమే బోర్డుకు అందించామని వివరించారు.