సుబేదారి, జూలై 5 : మావోయిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు దామోదర్ లొంగిపోయినట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో శనివారం లేఖ విడుదలైం ది. దామోదర్ గతంలో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయినట్టు, లొంగిపోతున్నట్టు పోలీసులు చాలాసార్లు ప్రచారం చేశారని, ప్రజలను గందరగోళ పర్చడానికి ఈ దుష్ప్రచారం కొనసాగుతున్నదని పేర్కొన్నారు. జూన్ 26న మంత్రి సీతక్కపై వచ్చిన పత్రికా ప్రకటనకు పార్టీకి సంబంధం లేదని చెప్పారు. తెలంగాణలో మావోయిస్ట్ కార్యకలాపాలు లేనప్పటికీ.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివాసీలను స్టేషన్లకు తీసుకెళ్లి బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 5 : భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఇంద్రావతి పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు జవాన్లపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగడంతో ఓ మావోయిస్టు మృతిచెందాడు. మృతదేహంతోపాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తుసామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం పేర్కొన్నారు.