హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వందకుపైగా చిన్నవి, పెద్దవి ఆనకట్టలు, డ్యామ్‌లు, ప్రాజెక్టులు (Irrigation Projects) ఉండగా.. వాటిలో ఒక్కదానికి సైతం సమగ్ర భద్రతన నివేదికను (Dam Safety Act) రూపొందించలేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై ఓ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను (Emergency Action Plan) సైతం సిద్ధం చేయలేదు. కేంద్రం తీసుకొచ్చిన ‘డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021’ ప్రకారం 2026 డిసెంబర్ నాటికి ఈ నివేదికలను సిద్ధం చేయాలి. దీనిపై ఇటీవల కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ కూడా రాశారు. ఆనకట్టల పరిమాణం, ఎత్తు, తదితర ప్రమాణాల ఆధారంగా దేశవ్యాప్తంగా 6500కు పైగా ఆనకట్టలను కేంద్రం చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది. వీటిలో తెలంగాణకు చెందినవి 173 ఉన్నాయి. ఇక చట్టం అమలుకు అత్యంత కీలకమైంది నిర్దేశిత డ్యామ్‌ల సమగ్ర భద్రత మూల్యాంకనం (సీడీఎస్ఈ). దానిని 2026 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలి. సీడీఎస్‌ఈని ఆయా ప్రాజెక్టుల యజమానులు నిర్వహించాల్సి ఉంది.
ముఖ్యంగా మూడు అంశాలపై రిపోర్టులను సిద్ధం చేయాలి. 1) డ్యామ్‌ల రిస్క్ అస్సెస్మెంట్ స్టడీ నిర్వహించాలి. అంటే ఆనకట్టల ప్రస్తుత పరిస్థితి, గతంలో ఏమైనా ప్రమాదాలు సంభవించాయా? రాబోయే రోజుల్లో ప్రమాదాలు సంభవించే అవకాశముందా? కరకట్టలు, గేట్లు తదితర వాటి స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేయాలి. 2) ఎమర్జెన్సీ యాక్షన్‌ప్లాన్, ఊహించని పమాదం సంభవిస్తే అత్యవసర ఉపశమన చర్యలు, ప్రమాద నివారణ చర్యలతో ప్రణాళికలను సిద్ధం చేయాలి. 3) డ్యామ్‌ల సమగ్ర భద్రత మూల్యాంకనం. ప్రతి ఆనకట్టకు సంబంధించి డిజిటల్ లాగ్‌బుక్‌లను, డాటాబేస్‌ను డిజిటల్ రూపంలో పొందుపరచాలి.
ఒక్క ఆనకట్టుకూ సీడీఎస్ఈ లేదు..
ప్రతీ ఆనకట్టకు సంబంధించి సీడీఎస్‌ఈని 2026 డిసెంబర్‌నాటికి పూర్తి చేయాలి. ఇందుకు మరో 13 నెలల గడువు మాత్రమే ఉన్నది. కానీ రాష్ట్రంలో ఒక్క ఆనకట్టకూ ఇప్పటికీ సీడీఎస్‌ఈని రూపొందించలేదు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్‌ను అనుసరించి స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. చట్టం పరిధిలోకి వెళ్లిన డ్యామ్‌లకు బాధ్యత వహించే అధికారులను సైతం ఇరిగేషన్‌శాఖ ఖరారు చేసింది. సీడీఎస్ఈ కోసం ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ ప్యానెల్స్‌ను నియమించాల్సి ఉంది. ఈ ప్యానెల్స్ ఆనకట్టలను సందర్శించి సీడీఎస్‌ఈని రూపొందించాలి. దేశవ్యాప్తంగానూ నిర్దేశిత 6500 ఆనకట్టలకు సంబంధించి సీడీఎస్ఈ పూర్తి కాలేదు.