నిజామాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో 22 నెలల వ్యవధిలో తొమ్మిది మంది రిజిస్ట్రార్లు మారారు. 2021 మే 22న వీసీగా నియమితులైన రవీందర్ గుప్తా.. ఇష్టానుసారంగా రిజిస్ట్రార్లను మార్చుకుంటూపోతున్నారు. 2021 నవంబర్ 27న సమావేశంలో కనకయ్యను ఈసీ తొలగించి యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించారు.
పాలకమండలి ఆదేశాలను ధిక్కరిస్తూ వీసీ.. ప్రొఫెసర్ శివశంకర్‌కు రిజిస్ట్రార్ బాధ్యతలిచ్చారు. కానీ, తాను చెప్పినట్టు వినట్లేదని ఆయన్ను తప్పించి ప్రొఫెసర్ విద్యావర్ధినికి పట్టం కట్టారు. ఆమె నియామకం చెల్లదంటూ తేల్చి చెప్పిన ఈసీ.. తిరిగి యాదగిరికి బాధ్యతలు అప్పగించింది. ఈసీ నిర్ణయాన్ని పక్కనపెట్టిన వీసీ.. ఓయూ నుంచి ప్రొఫెసర్ నిర్మలాదేవిని రిజిస్ట్రార్‌గా తీసుకొచ్చారు. యాదగిరే రిజిస్ట్రార్ అంటూ ఈసీ 56వ భేటీలో తేల్చి చెప్పింది. ఆయన బాధ్యతలు చేపట్టగా వీసీ.. రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేయించారు. దీంతో యాదగిరి రిజిస్ట్రార్ గది వైపు వెళ్లడమే మానేశారు.