Telangana PCC | హైదరాబాద్, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై మళ్లీ పీఠముడి పడింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కీలక మంత్రులు ఢిల్లీలో రెండు రోజులు మంత్రాంగం సాగించినా అధిష్ఠానం ఎటూ తేల్చకుండా వారిని తిప్పిపంపింది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరినట్టు తెలిసింది. తన అనుయాయులను పీసీసీ పీఠంపై కూర్చోబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తుండగా ఇందుకు చెక్ పెట్టేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
మొన్నటివరకు పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ పేరు దాదాపు ఖరారైందని అన్నారు. శనివారం మధ్యాహ్నానికి సీనియర్ నేత మధుయాష్కీగౌడ్ ముందువరుసలోకి వచ్చినట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆయనకు పలువురు సీనియర్ మంత్రులతోపాటు నేతలు మద్దతు పలుకుతున్నట్టు తెలిసింది. పీసీసీ పదవికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించిన పేర్లపై అధిష్ఠానం పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలిసింది. అలా చేస్తే.. పార్టీ, ప్రభుత్వం రెండూ ఆయన చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలిసింది.
ఒకరికి ఒకరు చెక్ పెట్టే పనిలో.
సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితులకు పీసీసీ పదవి దక్కొద్దని సీనియర్ నేతలు, తనవారికి కాకుండా ఇతరులెవరికీ పీసీసీ పదవి దక్కొద్దని రేవంత్రెడ్డివర్గం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. తన వారికి కాకుండా సీనియర్లకు, అధిష్ఠానానికి దగ్గరగా ఉండే నేతలకు పీసీసీ పీఠం దక్కితే తనకు చెక్ పడినట్టేనని రేవంత్ భావిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. రేవంత్ వర్గం నేతలకు పీసీసీ పీఠం దక్కితే తమ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని సీనియర్ నేతలు ఆందోళనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకుంటున్నట్టు సమాచారం.
సీఎం.. సైలెంట్!
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసి శనివారం హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఈసారి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం వారిని ఉత్తచేతులతోనే తిప్పి పంపింది. పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక, మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం తీసుకుంటారని భావించినా సీఎం రేవంత్‌రెడ్డి 20వ పర్యటనలోనూ ఢిల్లీ పెద్దలు ఏమీ తేల్చలేదు. దీంతో సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు ఆశావహులంతా ఉసూరుమంటూ తిరిగి రావాల్సి వచ్చింది.
ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడా బయటికి కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించగా.. శనివారం ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. సాధారణం గా ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి సీఎం రోజూ ఏదో ఒక హడావుడి చేస్తుంటారు. అధికారిక కార్యక్రమాలు లేకపోతే కనీసం నేతలతో సమావేశాలు, మీడియాతో చిట్‌చాట్ చేస్తుంటారు. కానీ అలాంటిదేమీ కనిపించలేదు. మీడియాతో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రమే మాట్లాడారు. దీంతో ‘సీఎం ఎందుకు సైలెంట్ అయ్యారు’ అని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
ఆరు నెలలుగా ముప్పుతిప్పలు
పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం 6 నెలలుగా ముప్పు తిప్పలు పెడుతున్నదని ఆశావహులు మండిపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచీ అదిగో.. ఇదిగో.. అంటూ ఊరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం అంటూ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసేదాకా వెళ్లిందని గుర్తుచేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేదాకా కోడ్‌ను, ఆ తర్వాత ఆషాఢమాసం అంటూ అడ్డుకున్నారని చెప్తున్నారు. శ్రావణమాసం మొదలుకాగానే ప్రమాణ స్వీకారమే అంటూ ఊరించారని.. మరో వారంలో శ్రావణం ముగుస్తున్నా తేల్చడం లేదని చెప్తున్నారు. ఓవైపు ఢిల్లీ పెద్దలు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడం, మరోవైపు పార్టీ, ప్రభుత్వంలో ఒత్తిడి పెరగటం వల్లే రేవంత్‌రెడ్డి శనివారం ఎక్కడా కనిపించలేదని చర్చ జరుగుతున్నది.