TS EAPCET | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ ఎప్‌సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సిం గ్) వాయిదా పడే అవకాశం ఉన్నది. మే 9, 10న ఇంజినీరింగ్, 11, 12న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తామని జేఎన్టీయూ అధికారులు గతంలోనే షెడ్యూల్‌ను విడుదల చేశారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగనున్నది. అంటే మే 12న పోలింగ్ కేంద్రాలను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకొంటారు. ఈ నేపథ్యంలో ఎప్‌సెట్ పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందా? లేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. ఇంజినీరింగ్ పరీక్షలను సజావుగా నిర్వహించవచ్చని, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందన్న భావన అధికారుల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్, ఫార్మసీవిభాగం పరీక్షను వాయిదా వేయడ మా.. ? లేదా మొత్తానికి మొత్తం పరీక్షలను వాయిదా వేయాలా..? అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సెంటర్ల సామర్థ్యాన్ని 30 -35వేలకు పెంచడం ద్వారా త్వరగా పరీక్షలు పూర్తిచేయాలని నిర్ణయానికి వచ్చారు. తక్కువ దరఖాస్తులొస్తే మే 11న పరీక్షలు పూర్తిచేయాలన్న అభిప్రాయం వచ్చింది. అధికంగా వస్తే మాత్రం పరీక్షలు వాయిదా వేయక తప్పనిసరి పరిస్థితులుంటాయి. పరీక్షలను ముందు జరిపితే ఎలా ఉంటుందన్న అభిప్రా యం అధికారుల్లో వ్యక్తమైంది. మే 8న టీఎస్పీఎస్సీ మరో పరీక్ష ఉండటంతో ఇది వీలుపడటంలేదు. ఇదే అంశంపై ఓ ఉన్నతాధికారిని సంప్రదించగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో చర్చించి, త్వరలోనే ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. ఎప్‌సెట్ దరఖాస్తులు లక్ష మార్కు ను దాటాయి. ఇంజినీరింగ్‌కు 82,602, అగ్రికల్చర్, ఫార్మసీకి 38,636 దరఖాస్తులొచ్చాయి.
ఐసెట్ వాయిదాపై అతిత్వరలో స్పష్టత
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్ పరీక్షలు వాయిదాపడనున్నాయి. ఐసెట్ పరీక్షలను జూన్ 4, 5న నిర్వహిస్తామని కాకతీయ యూనివర్సిటీ అధికారులు గతంలో ప్రకటించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లలెక్కింపు కూడా జూన్ 4న జరుగనున్నది. అంటే, ఈ లెక్కన ఐసెట్ వాయిదావేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిపై మంగళవారంలోపు స్పష్టత ఇస్తామని ఓ అధికారి తెలిపారు.
మేలో డిపార్టుమెంటల్ పరీక్షలు జరిగేనా?
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం మే 13 నుంచి 21 వరకు నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై అధికారులు ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నదని తెలిసింది.