ICET | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రొఫెషనల్ కోర్సుల్లో ఎంబీఏ.. ఎంసీఏ కోర్సులంటేనే ఎవర్గ్రీన్ కోర్సులు. ఈ కోర్సుల్లో చేరేందుకే అత్యధికులు ఆసక్తిచూపిస్తారు. కొంతకాలంగా ఈ రెండు కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతుండగా, ఈ ఏడాది సైతం అదే పునరావృతమైంది. ఎంసీఏలో 86శాతం, ఎంబీఏలో 87.5శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలోనే 80శాతానికిపైగా సీట్లు భర్తీకావడం విశేషం. ఐసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ సీట్లను శుక్రవారం కేటాయించారు. 34,748 సీట్లకు 30,300 సీట్లు తొలి విడతలోనే నిండాయి. 4,448 సీట్లు మిగలగా వీటిని రెండో విడతలో భర్తీచేస్తారు. 285కాలేజీలకు 91 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. 17లోపు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని, 25 నుంచి 28వరకు సర్టిఫికెట్లను కాలేజీల్లో సమర్పించాలని సూచించారు.
ఇంటర్‌బోర్డు కార్యదర్శిగా శ్రీదేవసేన
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇంటర్‌బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్య కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి శ్రీదేవసేనకు ప్రభుత్వం అదనపు బాధ్యతలప్పగించింది. ఇంతకాలం ఈ హోదాలో పనిచేసిన శృతిఓజా ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు. ఇందుకు సర్కార్ అనుమతి ఇవ్వడంతో ఈనెల 16నుంచి ఏడాదిపాటు సెలవుపై వెళ్లనున్నారు. సాంకేతిక, కళాశాల విద్యాశాఖల కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీదేవసేనకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్య కమిషనర్‌గా అదనపు బాధ్యతలప్పగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు విడుదల చేశారు.