హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో పనిచేసే అంబుడ్స్‌మెన్ సేవలపై సందిగ్ధత నెలకొన్నది. ఉపాధి పనులకు సంబంధించిన ఫిర్యాదులు, విచారణ కోసం 2021లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాబాద్ మినహా అన్ని జిల్లాల్లో అంబుడ్స్‌మన్‌లను నియమించింది. క్షేత్రస్థాయిలో అనుభవమున్న రిటైర్డ్ ఉద్యోగులను 32 జిల్లాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అంబుడ్స్మన్లుగా తీసుకున్నారు. ఏడాది పాటు ఉండే వీరి పదవీ కాలాన్ని 2021 నుంచి 2024 వరకు ప్రభుత్వం పొడిగించుకుంటూ వచ్చింది. చివరికి నిరుడు జూలైతో వీరి పదవికాలం ముగిసింది. నాటి నుంచి వీరిని కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. దీంతో అసలు అంబుడ్స్‌మెన్ సేవలను కొనసాగిస్తారా? లేక వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారా? లేకుంటే పూర్తిగా అంబుడ్స్‌మెన్ వ్యవస్థనే ఎత్తేస్తారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
పనితీరుపై నివేదిక అడిగిన ప్రభుత్వం
ఉపాధి హామీ పథకంలో అంబుడ్స్‌మెన్ సేవల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోయినప్పటికీ వారి పనితీరుపై వివరాలు ఇవ్వాలని ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కోరింది. 2024 ఏప్రిల్ ఒకటి నుంచి 2025 మార్చి ఒకటి వరకు వారి పనితీరు (ఫర్ఫార్మెన్స్ అప్రైజల్)పై ఈ నెల 10లోగా నివేదికలు అందజేయాలని ఆ శాఖ డైరెక్టర్ డాక్టర్ సృజన జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలు, ఉపాధి హామీ జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్లను ఆదేశించారు. దీంతో అంబుడ్స్‌మన్‌లను కొనసాగించకుండా వారి పనితీరుపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం విచిత్రంగా ఉన్నదని పలువురు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి 20 వరకు రాష్ట్రంలో పార్లమెంటరీ అధ్యయన కమిటీ పర్యటించనున్నదని, ఆ కమిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అంబుడ్స్‌మెన్ పనితీరుపై నివేదిక అడిగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పనుల్లో పాదర్శకత కోసం అంబుడ్స్‌మెన్ వ్యవస్థ
ఉపాధి హామీ పథకం కింద ఫిర్యాదులను పరిషరించడానికి అంబుడ్స్‌మెన్ వ్యవస్థను గత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఉపాధి పనులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఈ వ్యవస్థ సహాయపడుతుంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో అంబుడ్స్‌మెన్ వ్యవస్థ ఉన్నది. ఉపాధి హామీ పథకం పనుల సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే ప్రజలు అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదులపై అంబుడ్స్‌మెన్ విచారణ జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. తద్వారా ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది.