హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): నర్సింగ్ గ్రేడ్-1 పదోన్నతుల్లో గందరగోళం ఏర్పడింది. బుధవారం జరిగిన ప్రమోషన్లలో సీనియారిటీ ప్రకా రం ఆప్షన్లు ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్‌లో జూనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారని మండిపడుతూ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయంలో ఆందోళనకు దిగారు.
పోస్టింగ్‌లు ఇవ్వడంలో కొందరు ఉన్నతాధికారులు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇదే విషయంపై ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనరసింహకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 గ్రేడ్-1 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని ప్రమోషన్ విధానంలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం డీఎంఈ కార్యాలయంలో జరిగిన ప్రమోషన్, పోస్టింగ్ ప్రక్రియలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.