వాళ్లు అడవే ప్రాణంగా బతికే గిరిజన బిడ్డలు. వనంతో మమేకమై ప్రకృతితోనే జీవితాలను పెనవేసుకున్న అమాయకులు. నీటిలో నుంంచి చేపలను బయటకు తీస్తే ఎలా విలవిలలాడి చనిపోతాయో.. ఆ అడవి నుంచి వారిని బయటకు తీసుకొచ్చినా అలానే ప్రాణాలు వదిలేటంత నిస్సహాయులు! అలాంటి అడవి దాటని చెంచుల పాశవిక వధకు ప్రభుత్వం కుట్ర చేసిందా? చెంచులకు నీళ్లు లేకుండా చేసి దూపతో చంపుతున్నాదా? చెంచు సంక్షేమ సంస్థ ఐటీడీఏను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నాదా? చెంచులను భయంకరమైన శత్రువులుగా చూసే ఫారెస్టు శాఖకు ఐటీడీఏ పీవో బాధ్యతలు అప్పగించడం వెనుక అసలు మర్మం ఇదేనా? చెంచు మహిళల్లో రక్తహీనత, పురుషుల్లో పోషకాహార లోప మరణాలు పాలకుల కుట్రలో భాగమేనా? నల్లమల ఫారెస్టులో ఎందుకీ నిశ్శబ్ద నరమేధం
Nallamala Forest | నల్లమలలో ఆదివాసీ చెంచులు లేకుండా చేసేందుకు కావాలనే పొగబెడుతున్నారనే తీవ్ర అభియోగాలను ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. క్షేత్రస్థాయిలో చెంచుల దయనీయ పరిస్థితిని చూస్తుంటే అది నిజమేనని స్పష్టమవుతున్నది. అడవిలో పెద్దపులికి కూడ భయపడని చెంచులు.. ఫారెస్టు అధికారులను చూసి నిట్టనిలువునా వణికిపోతున్నారు. శత్రుత్వ భావంతో ఉన్న ఫారెస్టు శాఖకే కాంగ్రెస్ ప్రభుత్వం చెంచు సంక్షేమం కోసం పనిచేసే ఐటీడీఏ పీవో బాధ్యతలు అప్పగించడం మరింత విస్మయం కలిగిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయం గిరిపుత్రుల చావుకొచ్చింది. యుక్త వయసులోనే నెత్తురుడిగి, ఒంట్లో సత్తువ లేని ఆడబిడ్డలు నెత్తిన బిందెలు, చంకన చంటిబిడ్డలతో కొండలు ఎక్కిదిగుతూ నీటితడి కోసం తండ్లాడుతున్న హృదయ విదారక దృశ్యాలు చెంచుపెంటల్లో కనిపిస్తున్నాయి. మాడు పగిలే ఎండలో మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి చెలిమె నీళ్లు తెచ్చుకొని తాగి వాంతులు, విరోచనాలతో చనిపోతున్నామని చెంచులు రోదిస్తున్నారు.
యురేనియం అన్వేషణ కోసం నల్లమల నట్టడవిలో 4 వేల బోర్లు వేసి, అడవిని తూట్లు పొడిచిన ప్రభుత్వానికి.. పెంటకో మంచినీటి బోరు వేసి చెంచులకు గుక్కెడు నీళ్లు ఇవ్వడానికి మాత్రం చేతులు రావడం లేదు. పైగా అటవీ చట్టాలు అడ్డుగా ఉన్నాయని సాకులు చెప్తున్నది. మండువేసవిలో వన్యప్రాణుల దాహం తీర్చడం కోసం దట్టమైన అడవిలో నీటి గుంతలు (ఫారెస్ట్ శాఖ పరిభాషలో సాసర్‌పిట్స్) ఏర్పాటు చేస్తారు. అభయారణ్యంలో 1,100 సాసర్పిట్లు ఏర్పాటు చేసినట్టు డీఎఫ్‌వో కమ్ ఐటీడీఏ పీవో నివేదికలు చెప్తున్నాయి. దాహానికి తట్టుకోలేక గిరిజనులు ఆ సాసర్పిట్లలోని నీటితో గొంతు తడుపుకున్నా పాపమేనట! ఫారెస్టు అధికారులు వారిని జంతువుల కంటే హీనంగా హింసిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్నేండ్లుగా నల్లమలలో అడవి దాటని చెంచుల చావు కబురుపై ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించి అందిస్తున్న కథనమిది.
(నల్లమల నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) పరిధిలోని 88 చెంచుపెంటల్లో 2,595 కుటుంబాలు నివసిస్తున్నాయి. అభయారణ్యం పరిధిలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాల్లో మొత్తం 18 చెంచుపెంటలు ఉన్నాయి. వాటిలో 320 కుటుంబాలు ఉంటాయి. కొల్లాపూర్ మండలంలో 9 పెంటలు ఉండగా.. 170 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ పెంటలన్నీ పులుల అభయారణ్యం పరిధిలోనే ఉన్నాయి. వీళ్లను ఇతర ప్రాంతాలకు తరలించడానికి దాదాపు 15ఏండ్ల నుంచి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. కానీ, చెంచులు అడవిదాటి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెంచుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించారు. వారిని బలవంతంగా అడవి దాటించడానికి ఇష్టపడలేదు. చెంచుల నివాస ప్రాంతాలకే మిషన్ భగీరథ నీటిని సరఫరా చేశారు. వారికి రేషన్‌కార్డులు ఇచ్చారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద ప్రత్యేక చెంచు ప్రాజెక్టు పెట్టించి వారికి అడ్వాన్స్ నగదు ఇప్పించే ఏర్పాటుచేశారు. ఫారెస్టు అధికారుల దాడులను నివారించారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క పెంటకూ రక్షిత తాగునీటి వసతి లేదు. అడవిలో మూడు, నాలుగు కిలోమీటర్లు నడిచి పాత చెలిమెల్లో దొరికే ఊటనీరు తెచ్చుకుంటున్నారు. అభయారణ్యంలో 14 పెంటలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నట్టు అధికారిక నివేదికలు చెప్తున్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో ఏ ఒక్క పెంటకూ వాటర్‌ట్యాంకర్ వెళ్లిన దాఖలాలైతే కనిపించలేదు. స్థానిక చెంచులు కూడా ట్యాంకర్లు వస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు.
లింగాల మండలం ఈర్లపెంటలో 35 కుటుంబాలు జీవిస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్లు అందేవి. ఇప్పుడా నీళ్లు కూడా ఆగిపోయాయి. ఈ పెంటకు ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్టు ఐటీడీఏ రికార్డుల్లో చూపుతున్నది. కానీ, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే… ఈర్లపెంట చెంచులు మూడు కిలోమీటర్లు నడిచి సుద్దబాయి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
సుద్దబాయి నీళ్లు అంటే బండ సొరికల వెంబడి అక్కడక్కడా పాతనీళ్లు నిలిచిపోతాయి. ఈ నీళ్లు బురద, కుళ్లిన ఆకులతో కలిసిపోయి ఉంటాయి. బురదను కదిలించకుండా గిరిజనులు పైపై నీళ్లను చెంబులతో తోడి బిందెల్లో నింపుకొంటున్నారు. ఈ నీళ్లు రెండు మూడు రోజల కంటే ఎక్కువ రావని స్థానిక చెంచు యువకుడు ఈదయ్య చెప్పాడు. రోజంతా కూర్చుంటే పేరుకున్న నీళ్లు మనిషికి బిందె చొప్పున దొరుకుతున్నాయని అదే పెంటకు చెందిన గురువయ్య తన అనుభవాన్ని చెప్పారు. సుద్దబాయి నీళ్లు తోడేటప్పుడు చెయ్యి కొద్దిగా అటూఇటూ కదిలినా… బురద నీళ్లు వస్తాయని, ఈ నీళ్లు తాగితే కక్కుడు-పారుడు పెడ్తదని గురువయ్య వాళ్ల దీనావస్థను వివరించారు. ‘ఎండాకాలం వచ్చిందంటే మా చెంచులు నీళ్ల దూపతోనే సచ్చిపోతరు’ అని పుల్లయాపల్లి పెంటకు చెందిన గంగయ్య అనే చెంచు యువకుడు ఆవేదన వ్యక్తంచేశారు.
శ్రీశైలం రోడ్డుకు పైవైపునకు కొమ్మినపెంట ఉన్నది. ఇక్కడ 42 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వీళ్ల నీటి అవసరాలు తీర్చే తోళ్లవాగు ఈ ఏడాది పూర్తిగా ఎండిపోయింది. అచ్చంపేట ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు ఉన్నప్పడు ఒక బోరు వేయించారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ దానికి సౌర విద్యుత్తును ఏర్పాటు చేసింది. కొంతకాలం బాగానే బోరు పనిచేసింది. ఈ ఏడాది వాగు ఎండిపోయింది, దాంతోపాటే బోరు కూడా పోయింది. ఇప్పుడిక్కడ తిన్న పల్లెం కడుక్కుందామన్నా నీళ్లు లేని దుస్థితి. గుక్కెడు నీళ్ల కోసం చెంచులు దాదాపు రెండు కిలోమీటర్లు గుట్టలచేను మీద నుంచి నడిచి బండలరేవు మడుగు నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ నీళ్లు కూడా పచ్చ పడ్డాయని, నీళ్లు తాగితే పిల్లలకు విరేచనాలు అవుతున్నాయని ఆర్తి ఈదయ్య చెప్పారు. మాడు పగిలే ఎండలో పోయి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంతువుల నీటి అసవరాల కోసం కృత్రిమ నీటి మడుగులను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
వీటిని సాసర్పిట్లు అని పిలుస్తారు. ఇటువంటివి 1,100 వరకు ఏర్పాటు చేసినట్టు అంచనా. ఇవన్నీ దట్టమైన అడవిలోనే ఉన్నాయి. వన్యప్రాణులు ఎకడ ఎకువగా సంచరిస్తుంటాయో అకడ వీటిని ఏర్పాటు చేశామని, వాటికి ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా నీటివసతి కల్పిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ‘అవే ట్రాక్టర్లతో కాసిన్ని నీళ్లు చెంచుల తాగునీటి అవసరాలకు ఇవ్వవచ్చు కదా..! కానీ ఇస్తలేరు. అందులోంచి చుక్కనీరు కూడా ఫారెస్టు అధికారులు మాకు ఇవ్వరు’ అని కొక్కెరేవు పెంటకు చెందిన మల్లయ్య అనే చెంచు యువకుడు చెప్పారు. కొక్కెరేవు పెంటలో ఏడేండ్ల కిందట 10 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడక్కడ కుటుంబాలేమీ లేవు. రోగాలు, పోషకాహారలోపం, నీటి వసతి లేకపోవడం తదితర కారణాలతో పెద్దవాళ్లు చనిపోగా.. ఈతరం పిల్లలు అక్కడి నుంచి బతుకుదెరువును వెతుక్కుంటూ వలస వెళ్లిపోయారు. ఫారెస్టు అధికారులు కొక్కెరేవు పెంట తరహాలోనే అన్ని పెంటలను తరలించడానికి కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అంతోఇంతో అడవి బిడ్డల సంక్షేమాన్ని కాంక్షించేది సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థే. చెంచులు అడవిలో సేకరించిన జిగురు, ఇప్పపలుకు, ఇప్పపువ్వు, కానుగ పలుకులు, తేనె, నరమామిడి చెక, గుడిపల్లేరు, చీపురు పుల్లలు, కుంకుడుకాయలు, చింతపండు, విస్తరాకులు వంటి అటవీ ఉత్పత్తులను జీసీసీ ద్వారా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేది. ఐటీడీఏ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు గిరిజనుల ఇంటిదాకా వెళ్లడంలో కీలక భూమిక పోషించింది.
ఐటీడీఏ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే చెంచులు అడవి దాటి రావడానికి ఇష్టపడటం లేదని ఫారెస్టు అధికారులు అనేక నివేదికలు రూపొందించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారు. గిరిజన సంక్షేమం కోసం ఐటీడీఏ అధికారులు కృషి చేయడం, అడ్డుకోవడానికి ఫారెస్టు అధికారులు ప్రయత్నించడం.. ఈ క్రమంలో వారి మధ్య నిత్య ఘర్షణ జరిగేది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ననూరు ఐటీడీఏ పీవో బాధ్యతలను నేరుగా డీఎఫ్వోకే అప్పగించింది.
ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా డీఎఫ్‌వో ఐటీడీఏ ఇన్చార్జి పీవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక జూనియర్ అసిస్టెంట్‌తో ఐటీడీఏ కార్యాలయాన్ని నడిపిస్తున్నారు. చెంచుల కోసం ఐటీడీఏ కింద ఓ బోరుబావి, కొంత పోషకాహారమో, ఒక సంక్షేమ పథకమో మంజూరైతే.. ఆ సంస్థ పీవో హోదాలో ఉన్న డీఎఫ్‌వో వాటిని పనిగట్టుకొని రద్దు చేస్తున్నట్టు స్థానిక చెంచులు వాపోతున్నారు. చెంచులను అటు అడవిలోకి వెళ్లకుండా.. ఇటు సంక్షేమం అందకుండా కట్టడి చేయడం ద్వారా చచ్చేవాళ్లు చావగా.. మిగిలిన వాళ్లు అడవి దాడి వెళ్తారని పాలకులు, ఫారెస్టు అధికారులు కలిసి కుట్ర చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అదే జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామం వద్ద 1,501 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని చదును చేశారు. వచ్చే రెండేండ్లలోపు చెంచులను అడవి దాటించి బాచారం తరలించాలనే లక్ష్యంగానే అటవీశాఖ అధికారులకు ఆదేశాలున్నాయని, ఈ పనికోసమే డీఎఫ్‌వోను దీర్ఘకాలికంగా బదిలీ లేకుండా కొనసాగిస్తూ.. ఐటీడీఏ పీవో బాధ్యతులు కూడా ఆయనకే అప్పగించారన్నది ప్రజాసంఘాల నేతల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ.
అడవిలో పులుల సంఖ్య పెరిగిందని, చెంచుల సంచారం శాకాహార జంతువుల ఉనికికి అడ్డంకిగా మారుతుందనే కారణంతో గిరిజనులను అడవిలోకి వెళ్లకుండా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు. కనీసం చెంచులు తమ పెంట విడిచి పొరుగు పెంటన ఉన్న బంధువుల ఇండ్లకు వెళ్లాలన్నా… ఫారెస్టు అధికారుల అనుమతి అవసరమనే నిబంధన అమలు చేస్తున్నారని జిల్లెలపెంటలో కనిపించిన ఓ పశువుల కాపరి తన అనుభవాన్ని వివరించారు. గతంలో జిల్లెలపెంట, కానులపెంట, బూడితపెంటలో కలిపి దాదాపు 45 చెంచు కుటుంబాలు ఉండేవి. వీళ్లంతా కలిసి ఎల్పులమ్మ చేనులో వ్యవసాయం చేసుకునేవాళ్లు. ఇప్పడవి విలుప్త పెంటలు. జనసంచారం లేదు. ఎక్కడికి పోయారో అంతుచిక్కడం లేదని పరిసర ప్రాంత చెంచులు చెప్తున్నారు. ఓ సంస్థ సర్వే ప్రకారం.. చెంచుల జీవన ప్రమాణాలు వేగంగా పడిపోతున్నాయి. రోగాలు, పోషకాహారలోపం, మంచినీటి ఎద్దడి తదిరత కారణాలతో గడిచిన రెండేండ్లలో చెంచుపెంటల్లో 350 మంది పురుషులు, 420 మంది మహిళలు మృత్యువాతపడినట్టు ఆ సంస్థ నివేదించింది. చెంచు పెంటల్లో నివసిస్తున్న ఆదివాసీల ఆయుప్రమాణాలు 40 ఏండ్ల కంటే దిగువకు పడిపోతున్నాయి. పోకాహారలోపం, రక్తహీనత, నీటి కరువు, వైద్యం అందకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయి. అటవీ చట్టాలను బలోపేతం చేయడం వల్ల నల్లమలలో పులుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఇది సంతోషించదగిన పరిణామమే. కానీ, అదే నల్లమలలో భాగమైన చెంచుల జనాభా మాత్రం ఏటా ఐదు శాతం తగ్గుతూ వస్తున్నదని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
తగిన జీవనోపాధిని కల్పించడానికి, పోషకాహార లోపాన్ని నివారించేందుకుగాను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెంచుపెంటల్లో ప్రత్యేక ప్రాజెక్టు ద్వారా పనులు కేటాయించేవారు. దాదాపు 15 రోజుల పనిదినాలకు గాను రూ.1,000 అడ్వాన్స్‌గా ఇచ్చేవారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక చొరవ చూపి ఈ అడ్వాన్స్ చెంచులకు అందేలా ఏర్పాటుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెంచు ప్రత్యేక ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేసింది. ఆదివాసీ గిరిజనులపై ముప్పేటదాడితో వారి జీవనం దయనీయంగా మారింది.