హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే ఈ వేసవిలో సమ్మర్ స్పెషల్ రైళ్లను నడిపించే అవకాశాలు కనిపించడం లేదు. ప్రయాణికుల సంక్షేమం కన్నా కేవంల ఆదాయంపైనే దృష్టి సారించిన అధికారులు ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు మొగ్గు చూపడం లేదు. ప్రతి ఏడాది వేసవి రాకకు రెండు నెలల ముందే ఆయా మార్గాల్లో నడిపే ప్రత్యేక రైళ్ల జాబితాను రైల్వే శాఖ ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది ఇంతవరకు ఆ ప్రస్తావనే చేయలేదు.
అయితే కొన్ని లాభదాయకమైన మార్గాల్లో మాత్రం ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 303 ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో ప్యాసింజర్ స్పెషల్ రైళ్ల పేరుతో 156 రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లలో ప్రతిరోజు దాదాపు 13 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడం వల్ల రైల్వేకు ఆదాయం పెరగడంతోపాటు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.