అబ్బబ్బ.. పొలాల్లోకి డ్రోన్లు ఇంట్లో ఉండి పంటను చూసుకోవచ్చు పురుగుపడితే మందు కూడా కొడతాయి గాల్లో చక్కర్లు కొడుతూ భూమి చుట్టూ గీతలు గీస్తాయి ఎహే! ఇదంతా కాదు.. వ్యవసాయానికి మొత్తం హైటెక్ హంగులే.. డిజిటల్ దండోరానే ఇవీ.. బడ్జెట్లో సాగుకు కేంద్రం అద్దిన సోకులు అసలు రైతుల డిమాండ్లపై మాట మాట్లాడలేదు వారి ఆదాయాన్ని పెంచే మార్గాలూ చూపలేదు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో రైతులకు నిరాశే ఎదురైంది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికిన మోదీ సర్కారు.. ఆ దిశగా చేపట్టిన చర్యలేమీ లేవు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగం కోసం తీసుకొనే నిర్ణయాలను నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పురుగుల మందు చల్లటానికి, పంటను పర్యవేక్షించటానికి ‘కిసాన్ డ్రోన్స్’ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అవి భూ రికార్డుల డిజిటలైజేషన్, పంటల పరిశీలనకు ఉపయోగపడతాయని అన్నారు. మొత్తంగా రైతులు హైటెక్ అయిపోతారని గాల్లో మేడలు కట్టి చూపించారు. 92 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయంపై నిర్మల రెండున్నర నిమిషాలే మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో వరి ఉత్పత్తి ఎక్కువగా ఉన్నందున పంట మార్పిడి చేస్తే మేలు ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. కానీ, దానిపై నిర్మల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా, 12 కోట్ల టన్నుల బియ్యం, గోధుమలు సేకరిస్తున్నట్టు వివరించారు. అందుకోసం 163 లక్షల మంది రైతులకు రూ.2.37 లక్షల కోట్లు ఇవ్వనున్నట్టు వ్యాఖ్యానించారు. ఇంతలా చెప్తున్నారు కానీ.. మొన్నటికిమొన్న తెలంగాణ నుంచి బియ్యం కొనేందుకు కేంద్రం విముఖత ప్రదర్శించింది. దీంతో పంటమార్పిడి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సూచించారు. అదే విషయాన్ని ఆర్థిక సర్వే కూడా నొక్కి చెప్పింది. కానీ, దానిపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మద్దతు ధర ప్రకారం రైతులకు 2.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు కానీ, మద్దతు ధర చట్టంపై మాట్లాడలేదు.
బడ్జెట్లో వ్యవసాయ రంగంపై ముఖ్యాంశాలు:
వ్యవసాయ రుణ లక్ష్యం రూ.18 లక్షల కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.18 లక్షల కోట్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం 16.5 లక్షల కోట్లు ఉండగా, అదనంగా 1.5 లక్షల కోట్లు పెంచింది. మోదీ సర్కారు ఏటా వ్యవసాయ రుణ లక్ష్యాన్ని పెంచుకొంటూ వస్తున్నది. 2016-17లో క్రెడిట్ టార్గెట్ రూ.9 లక్షల కోట్లు ఉండగా రూ.10.66 లక్షల కోట్లు మంజూరు చేసింది, 2017-18లో రూ.10 లక్షల కోట్లకు పెంచగా, ఆ ఏడాది రూ.11.68 లక్షల కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించింది.
రైతుల ఆదాయం రెట్టింపేది?
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): దేశంలోని రైతుల ఆదాయాన్ని 2022 మార్చి నాటికి రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్రం.. ఇప్పుడు దానిపై కిక్కురుమనటం లేదు. బడ్జెట్లో ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ఎరువులు, డీజిల్ ధరల పెంపుతో పెట్టుబడి ఖర్చును రెట్టింపు చేసిన కేంద్రం.. ఇప్పుడు వ్యవసాయానికి టెక్ సోకులు అద్దే ప్రయత్నం చేసింది తప్ప, రైతుల డిమాండ్లను పట్టించుకోలేదు. 2015-16లో రైతు కుటుంబం నెలవారీ ఆదాయం రూ.8,059 ఉన్నట్టు పలు సంస్థలు వెల్లడించాయి. ఈ లెక్కన కేంద్ర హామీ ప్రకారం 2022 మార్చి నాటికి రైతు కుటుంబాల ఆదాయం రూ. 21,146 కావాలి. కానీ 2018-19లో ఎన్ఎస్ఎస్వో అధ్యయనం ప్రకారం రైతుల నెలవారీ ఆదాయం రూ. 10,218గానే ఉన్నది. గత మూడేండ్ల వృద్ధిరేటు ప్రకారం రైతుల నెలవారీ ఆదాయం రూ.12,955 మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం అంచనా వేసింది. ఇది కూడా కూలీల ఆదాయం పెరగడం వల్లే సాధ్యమైందని పేర్కొన్నది.