చిన్నప్పుడు అమ్మే ఆలన.. ముసలిదైతే ముతక..
చిన్నప్పుడు నాన్నే భరోసా.. వయసైపోతే భారం..
వృద్ధులైతే అమ్మానాన్ననే వద్దనే దారుణం..
కండ్లు మూయకముందే కాటికి పంపే కాఠిన్యం..
నడక నేర్పిన నాన్నను నట్టింట్లో ఛీకొట్టిన పాపం..
గోరు ముద్ద తినిపించిన అమ్మను గెంటేసిన లోకం..
వృద్ధాశ్రమాలవైపు పండుటాకుల అడుగులు!
భవబంధాలను తెంచుకోలేక ఆగని కన్నీళ్లు!!
చిన్నప్పుడు నా కొడుక్కి చిన్న జ్వరమొచ్చినా తట్టుకోలేకపోయా. దవాఖానకు వెళ్లి మందులు తెచ్చాం. ఎత్తుకుంటే తప్ప ఏడుపు ఆపేది కాదు. ఈ చేతులతోనే భుజాన ఎత్తుకొని రాత్రంతా తిరుగుతునే ఉన్నా. ఆ టైంలో నిద్రపోకున్నా పర్లేదనిపించింది. నా భర్త కూడా ఎత్తుకుని తిరిగాడు. నా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కానీ ఈ రోజు వాడు నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. నా భర్త చనిపోయిన ఏడాదికే నన్ను ఈ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిపోయాడు. వాడితో నా చివరి కోరిక పంచుకున్నా. నా ఊపిరి ఆగిపోయాక నువ్వే నా చితికి నిప్పంటించాలని అడిగా. చూద్దాంలే అంటూ వెళ్లిపోయాడు.
– మెహిదీపట్నంలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న వృద్ధురాలి కన్నీటి గాథ
కొడుకు ఇంట్లో నేనుంటే కోడలు వెళ్లిపోతానంటున్నది. ఓ రోజు కొడుకు, కోడలు గొడవపడటం విన్నా. మీ అమ్మ కావాలా? నేను కావాలా? అని అరిచింది. ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నానంటూ కోపంగా చెప్పింది. నా కొడుకు ఆమెను శాంతింపజేయటానికి ప్రయత్నించాడు. కానీ ఆమె మరింత కోపంతో తన నుంచి దూరం చేయకపోతే తానే చంపేస్తానని అరిచింది. నా కొడుకు ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. అదే రాత్రి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. అత్త వేధింపుల వల్లే వెళ్లిందంటూ బంధువులంతా నన్ను దోషిలా చూశారు. నా కొడుకు జీవితం నా వల్ల ఆగకూడదు. అందుకే నేను నా బిడ్డను వదిలేసి వృద్ధాశ్రమానికి వచ్చాను. నా కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె తరుక్కుమంటుంది. పేగులు కదిలినట్టు అనిపిస్తుంది.
– సైనిక్‌పురిలోని ఓ వృద్ధురాలు
ఈ ఆశ్రమంలో నేను ఉంటానని ఏ రోజూ అనుకోలేదు. నా దోస్తుల్లో కొందరు చనిపోయారు. ఇంకొందరూ వారి బిడ్డలు, మనవలు, మనవరాళ్లతో సరదాగా గడుపుతున్నారు. కానీ నేను మాత్రం ఇలా ఏకాకిగా మిగిలిపోయా. చుట్టూ చూస్తే నాలుగు గోడలు. ఏ గోడను చూసినా నా బిడ్డలే గుర్తొస్తున్నారు. ఇదిగో ఈ ఎడమవైపు గోడ నా కొడుకు. ఇదిగో ఈ కుడివైపు గోడ నా బిడ్డ. ఆ గోడలే నా బిడ్డలు. రోజంతా వాటిని చూసుకుంటూ ఉంటా. పిల్లలకు ప్రేమ లేకుంటే తల్లిదండ్రులు బతికి ఉన్నా లేనట్టే.
– మల్కాజిగిరికి చెందిన ఓ ఆశ్రమంలోని వృద్ధుడు
Old Age Homes | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): వృద్ధ జీవితం నేటి తరం వారసులకు శత్రువుగా మారుతున్నది. కనికరం లేని బిడ్డలు.. కడుపున మోసిన తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. మరికొందరు రోడ్డున వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇంకొందరు ఇంట్లోనే ఉంచి నరకం చూపిస్తున్నారు. బంధాలు, బంధుత్వాలు, ప్రేమానురాగాలు ఆవిరై చివరకు కడుపున పుట్టినవారు అమ్మానాన్నలకు పట్టెడు అన్నం పెట్టని దుస్థితికి చేరుకున్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసి, విశేష అనుభవాల జ్ఞానంతో మలిసంజెలోకి చేరిన ఆ వృద్ధులు అందరున్నా ఏకాకులుగా మిగులుతున్నారు. రోజురోజుకు వృద్ధాశ్రమాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని సామాజిక కార్యకర్తలను చెబుతున్నారు. గ్రేటర్లో అధికారికంగా 234కు పైగా వృద్ధ ఆశ్రమాలు ఉంటే.. అనధికారికంగా వ్యాపారమే పరమావధిగా 460కి పైగా ఆశ్రమాలు ఉన్నాయని తెలిపారు. రక్త సంబంధమే దూరం పెడితే ఇంక ఏ సంబంధం అక్కున చేర్చుకుంటుంది? ఇంట్లోని కష్టాలతో పోలిస్తే ఇక్కడ కొన్ని తక్కువేనంటూ వృద్ధులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
వృద్ధులకు గతంలో మంచి గౌరవం ఉండేది. వారిని కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉండేవారు. కుటుంబంలో వారి అభిప్రాయాలకు మన్నన దక్కేది. కానీ ఈ కార్పొరేట్ యుగంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య మానవత్వం క్షీణిస్తున్నది. వృద్ధులుగా మారాక వారితో పిల్లల అటాచ్మెంట్ తగ్గిపోతున్నది. నైతిక విలువలు లోపించటం, ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వటం, కార్పొరేట్ చదువులు, సాఫ్ట్వేర్ కొలువులు, వ్యాపారాలు, భారీ ఆదాయాల వెంట పరుగులతో అమ్మానాన్న నిరాదరణకు గురవుతున్నారు. కుటుంబవ్యవస్థను, పెద్దలను గౌరవించే సంప్రదాయమూ చెదిరిపోతున్నది. ఫలితంగా వృద్ధులు బిడ్డల చేతిలో వేధింపులకు గురవుతున్నారు.
సొంత ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ ఏ చీకటి మూలనో, వృద్ధాశ్రమంలోనో శేష జీవితం గడిపేస్తున్నారు. అందరూ ఉండి అనాథలుగా మిగిలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు పదుల వయసు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరు నిత్యం ఏదో ఒక రూపంలో వేధింపులకు గురవుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం వెల్లడించింది. హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ సర్వేలో 21 శాతం కోడళ్ల చేతిలో, 25 శాతం కొడుకుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నారని తేలింది. అయినా, బయటకు వెళ్లి బతకలేక మౌనంగా ఆ బాధలను దిగమింగుతూ కాలం వెల్లదీస్తున్నారు వృద్ధులు. ఇండ్లలో పనిచేసేవారి చేతిలోనూ 2 శాతం వృద్ధులు హింసకు గురవుతున్నారని సర్వే పేర్కొన్నది.
తమకంటూ ఏదీ దాచుకోకుండా, అవసరాలు తీర్చుకోకుండా, సంపాదనంతా పిల్లల కోసమే కూడబెట్టిన వారెందరో. చివరికి ఆ బిడ్డల చేతిలోనే ఛీత్కారాలకు గురవుతున్నారు. తిట్టడం, కొట్టడం, ఆహారం పెట్టకపోవటం, మాట్లాడకపోవటం, డబ్బుల కోసం వేధించటం, బాగోగులు పట్టించుకోకపోవటం, దూరంగా తీసుకెళ్లి వదిలేయటం వంటివి చేస్తున్నారు. కొన్ని దవాఖానలు, వృద్ధశ్రమాల్లోనూ సిబ్బంది వృద్ధుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. మేం అలాంటి ఆశ్రమాలను గుర్తించి కలెక్టర్ల సాయంతో మూసివేయించాం. వృద్ధుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
– కే నాగచంద్రికాదేవి, స్టేట్ కౌన్సిల్ మెంబర్, మహిళ, శిశు, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ శాఖ
బిడ్డల నిరాదరణకు గురవుతున్న వారికోసం కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం తెచ్చింది. దీనిని వినియోగించుకోవచ్చు. కానీ పిల్లలపై పోరాటం చేయడానికి చాలా మంది తల్లిదండ్రులు అంగీకరించటం లేదు. వారి ప్రేమ అలాంటిది. ఎన్ని బాధలైనా మౌనంగా భరిస్తున్నారు. వారిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత పిల్లలపైనే ఉంటుంది. ముఖ్యంగా కుటుంబాల ప్రాధాన్యం, మనుషుల మధ్య ఉండాల్సిన మానవీయ సంబంధాలపై పుస్తకాల్లో సిలబస్ చేయాలి. బిజీలైఫ్‌లో పడిపోయి చాలా మంది తమ తల్లిదండ్రులను దూరంగా పెడుతున్నారు. ఇందులో కొందరు కావాలని చేసుండకపోవచ్చు. కానీ జన్మనిచ్చినవారి కష్టాలను పరిష్కరించలేనంత బిజీగా ఉండటం సరైనది కాదు.
-పాన్యం కవిత, సైకాలజిస్టు