హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హైదరాబాద్ కన్నా జిల్లాల్లోనే మద్యపాన ప్రియులు అధికంగా ఉన్నారు. ఈ విషయాన్ని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్హెచ్ఎఫ్ఎస్-5) వెల్లడించింది. జిల్లాల్లో 15 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్కుల్లో మద్యం సేవించే వారు సగటున 43 శాతం ఉన్నట్టు ఆ సర్వే తెలిపింది. రాజధాని నగరంలో మాత్రం ఈ సంఖ్య కేవలం 28శాతం ఉన్నట్టు పేర్కొంది. ఖమ్మం జిల్లాలో అతి తక్కువగా 31.8 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇటీవల మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఆ జిల్లా నుంచే అత్యధికంగా ఏడువేల వరకు రావడం గమనార్హం. ఇక చిన్న జిల్లా అయిన జనగామలో అత్యధికంగా 60.6శాతం మద్యం సేవిస్తున్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. పనిచేసే మహిళల్లో చాలామంది మద్యం సేవిస్తున్నట్టు తెలిపింది. జిల్లా జనాభా, అక్కడ మద్యం సేవించే వారి సంఖ్య ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్టు పేర్కొంది.