JNTU | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో ఉన్నతాధికారి కుటుంబం పెత్తనం చెలాయిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీని చక్కదిద్దాల్సిన ఆయన పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగిన ఆయన భార్య చక్రం తిప్పుతున్నట్టు చెప్తున్నారు. ప్రతి పనిలోనూ ఆమె పెత్తనం పెరగడమే కాకుండా అధికారులు, ఆచార్యులను పిలిచి చీవాట్లు పెట్టడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆమె కీలకంగా వ్యవహరిస్తూ, అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారి చేయాల్సిన పనులను ఆయన భార్య చేయడంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మితిమీరుతున్న ఆమె జోక్యాన్ని కొందరు అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయమై ఆరా తీసేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఆ ఉన్నతాధికారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
జేఎన్టీయూను పలు సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. కొందరు విద్యార్థులు ఉన్నతాధికారిని కలిసి సమస్యలు చెప్పుకుని, పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. విషయం తెలిసిన ఉన్నతాధికారి భార్య ఇద్దరు కీలక అధికారులను పిలిచి చీవాట్లు పెట్టారట. విద్యార్థులను నియంత్రించలేకపోవడంపై మందలించారట. దీంతో వారు కూడా ఘాటుగానే స్పందించారట. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని, అవసరమైతే రాజీనామా చేస్తామని హెచ్చరించారట. అలాగే, ఇటీవల జేఎన్టీయూలో బోనాలు నిర్వహించారు. ఆమెను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒక అధికారిని.. ఆమె అందరి ముందు అవమానించారట. కొంతకాలం క్రితం సదరు ఉన్నతాధికారి మహబూబాబాద్, మంథనిలోని జేఎన్టీయూ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో సదరు ఉన్నతాధికారి భార్య కూడా ఆయన వెంటే ఉన్నారట.
జర్మనీలోని విద్యాసంస్థలతో ఒప్పందం విషయంలోనూ అన్ని వేళ్లు ఉన్నతాధికారి వైపే చూపిస్తున్నాయి. ఒప్పందంలో ఆయన కుమారుడు, భార్య చక్రం తిప్పినట్టు ఆరోపణలున్నాయి. కాసెల్ వర్సిటీని సందర్శించిన ఆరుగురు సభ్యుల బృందంలో సదరు ఉన్నతాధికారి భార్య కూడా ఉన్నట్టు తెలిసింది. అక్కడి అధికారులతో చర్చలు, సందర్శనల్లో ఆమె ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : దేశంలోని వివిధ ప్రాంతాల్లో విప్లవోద్యమాలను, వర్గపోరాటాలను అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీసీసీ, సీపీఐ (ఎంఎల్) పార్టీలు విలీనమయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పాయిగురిలో జరిగిన సమావేశంలో ఆయా పార్టీల ముఖ్యనేతలు విలీన ప్రకటన చేసినట్టు న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వెంకట్రామయ్య వెల్లడించారు.