హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ) : వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలోని బయోకెమిస్ట్ పదోన్నతుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 బయోకెమిస్ట్ పోస్టులు ఉండగా ఇటీవల మల్టీజోన్-1లో 9 మందికి, మల్టీజోన్-2లో ఒకరికి అధికారులు పదోన్నతి కల్పించారు. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేసిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 అభ్యర్థులు పదోన్నతికి అర్హులు. కానీ నిబంధనలు పాటించకుండా డిప్లొమా లేని వారికి అడ్డదారిలో ప్రమోషన్ ఇచ్చారని, అనర్హులకు కట్టబెట్టారని తెలుస్తున్నది. ప్రొవిజనల్ లిస్టులో లేని పేర్లు ఏకంగా తుది జాబితాలో ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేగాక గతంలో పదోన్నతులు పొందిన వారిపై విజిలెన్స్ విచారణ జరుగుతున్న క్రమంలో వాటిపై చర్యలు తీసుకోకుండా ప్రమోషన్లు కల్పించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రయర్ పర్మిషన్ కాలమ్‌ను ఎవరి ఒత్తిడితో తీసేశారనేది తేలాల్సి ఉన్నది. ఐదేండ్ల ఏసీఆర్(యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్) ఒక్క రోజులో ఎలా పదోన్నతి పొందిన అభ్యర్థులు సబ్మిట్ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఐదేండ్ల ఏసీఆర్ సమర్పించాలంటే కనీసం 5-7 రోజుల సమయం పడుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.
ప్రొవిజనల్ లిస్టుపై వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఏసీఆర్పై డైరెక్టర్ ఆఫ్ హెల్త్(హెచ్‌వోడీ) సంతకం లేకుండా ఎలా ప్రమోషన్లు ఇచ్చారో స్పష్టత రావాల్సి ఉన్నది. గతేడాది అక్టోబర్‌లో ప్రమోషన్ల వివరాలు సేకరించి, వీటి ఆధారంగా ఈ ఏడాది మే నెలలో ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టు తయారు చేశారు. సర్వీసులో ఉండి ముందస్తు అనుమతితో దూరవిద్య ద్వారా అర్హతకు అవసరమైన కోర్సు చేశారో వారికి అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. అయితే ఫైనల్ లిస్టులో అర్హత తీసుకోని వారి పేర్లు ఉండటం అర్హుల్లో ఆందోళన కలిగిస్తున్నది.
బయోకెమిస్ట్ పదోన్నతుల్లో ఓ మహిళాధికారి చక్రం తిప్పినట్టు తెలిసింది. ప్రమోషన్ పొందిన వారిలో ఇద్దరికి డిప్లొమా లేకుండానే పదోన్నతి కట్టబెట్టేందుకు రూ.2లక్షలు, మిగతా వారి నుంచి రూ.లక్ష వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. గతంలో లెక్చరర్ల పదోన్నతుల విషయంలోనూ సదరు అధికారి భారీగా ముడుపులు తీసుకున్నారని నర్సింగ్ ఆఫీసర్లు సైతం ఆరోపణలు గుప్పించారు. కాగా అర్హత ఉన్నా పదోన్నతి కల్పించకపోవడంపై ఇద్దరు ఉద్యోగులు ఇటీవల కోర్టును ఆశ్రయించగా, మరో ఉద్యోగి కూడా సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అర్హులు డిమాండ్ చేస్తున్నారు.