నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 15 (నమస్తే తెలంగాణ): బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఓ కానిస్టేబుల్‌కు 30 ఏండ్లపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ శిక్షతోపాటు రూ.12 వేల జరిమానా చెల్లించాలని నాంపల్లిలోని ప్రత్యేక పోక్సోకోర్టు జడ్జి ఉదయ్‌భాస్కర్‌రావు శుక్రవారం తీర్పు వెల్లడించారు. బాధిత బాలికకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శికి కోర్టు ఆదేశాలు జారీచేసింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారెళ్ల రమాదేవి కథనం ప్రకారం.. 2020లో కానిస్టేబుల్ వరదరాజ్ సుధేశ్ అలియాస్ ఉమేశ్ (39) (పీసీ నంబర్.3859) వరుసకు కోడలైన బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం నిందితుడు జైలునుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. టీ తేవాలంటూ బాధిత బాలికకు ఆమె అమ్మమ్మ చెప్పడంతో సదరు బాలిక మొదటి అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లింది. ఆ బాలిక గదిలోకి వెళ్లగానే తలుపులు మూసి ఆమెపై సుధేశ్ లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో బాధిత కుటుంబం పేర్కొన్నది. ఈ విషయాన్ని ఇతరులకు తెలిపితే బాధిత బాలిక సోదరుడిపై గంజాయి కేసు నమోదు చేయిస్తానని నిందితుడు బెదిరించినట్టు తెలిపారు.
తనపై జరిగిన ఘటన గురించి నిందితుడి భార్యకు వివరించగా, ఆమె సైతం బాలికను బెదిరించినట్టు వివరించారు. చివరికి బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్టు బాధిత బాలిక తల్లి తెలిపింది. 12 ఏండ్ల బాలిక వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు చార్జీషీట్ సమర్పించారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు.. నిందితుడు నేరం చేసినట్టు రుజువుకావడంతో పైశిక్షను ఖరారు చేసింది.