అమీర్‌పేట్, అక్టోబర్ 20 : హైదరాబాద్ బేగంపేట్‌కు చెందిన బ్రాండ్ సీఏఐ కలినరీ అకాడమీ.. 18 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో షెఫ్హ్యాట్ను రూపొందించి సరికొత్త గిన్నిస్ రికార్డు దిశగా అడుగులు వేసింది. ఇప్పటివరకు 15.9 అడుగుల ఎత్తుతో తలపై ధరించేందుకు వీలుగా షెఫ్హ్యాట్ను అమెరికాలోని టాంపాకు చెందిన ఒడిలోన్ ఒజారే తయారుచేసి, గిన్నిస్ రికార్డులోకెక్కారు. ఈ రికార్డును సీఏఐ తిరగరాసింది.
అంతర్జాతీయ షెఫ్‌ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఏఐకు చెందిన విద్యార్థులు, ఇన్స్ట్రక్టర్లు కలిసి ఫామ్ బోర్డు, డైమెన్షనల్ వినైల్ ప్రింట్‌ను వినియోగించి 18 అడు గుల భారీ షెఫ్ హ్యాట్‌ను తయారుచేశారు. 2023ను ఐక్యరాజ్యసమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ షెఫ్ హ్యాట్ చుట్టూ చిరు ధాన్యాలు, వాటి ప్రాముఖ్యతను వివరించేలా రాసిన రాతలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మినారాయణ షెఫ్ హ్యాట్ తయారీదారులను అభినందించారు.