ఎల్లారెడ్డిపేట, మార్చి 25 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో రైతు పొన్నవేణి దేవయ్య బావి అడుగంటింది. కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకుని రెండున్నర ఎకరాల భూమి ఉండగా, పన్నెండేళ్ల కింద కరువు పరిస్థితుల్లో రూ.5 లక్షలు పెట్టి 20 గజాల బావి తవ్వించాడు. అందులోనే బోరు వేయించి ఇన్నాళ్లూ సాగు చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడు చూసినా ఏడు గజాల మేర నీళ్లుండగా, సాగునీటి రంది లేకుండా సంతోషంగా గడిపాడు. కానీ, ఈ ఏడాది గజం నీళ్లు కూడా లేకుండా పోవడంతో ఆగమైపోయాడు.
ఇప్పటికే పంట పెట్టుబడికి రూ.70వేల దాకా ఖర్చు చేశాడు. చివరి దశలో పంటను కాపాడుకునేందుకు ఇటీవలే రూ.26వేలు పెట్టి బావిలో పూడిక తీయించాడు. అయినా నీళ్లు ఎల్లుతయో లేదోనని ఆందోళన చెందుతున్నాడు. పదేండ్ల సంది కరువన్నదే లేదని, ఈ ఏడు సాగునీటికి గోసపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇంక పదిహేను రోజులు నీళ్లందితేనే పంట ఉంటదని, లేకుంటే ఇబ్బందేనని వాపోయాడు.