హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్టు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ర్టాల్లో గెలిచిన బీజేపీ అప్పుడే సంబురపడాల్సిన పనిలేదు. మరో ఏడాదిన్నరలో ఆ పార్టీ ఏడు రాష్ర్టాలలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ కానుండటంతో అవి బీజేపీకి అత్యంత కీలకం కానున్నాయి. ఈ ఏడాది చివరలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు, హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సొంత రాష్ర్టాలు కావడంతో ఈ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షేనని చెప్పవచ్చు. ఈ రెండు రాష్ర్టాల్లో ఫలితాలు బీజేపీకి ఏ మాత్రం అనుకూలంగా లేకున్నా 2024లో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని అంచనా. గుజరాత్లో 1995 నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధిస్తూ వచ్చిన బీజేపీ ఈ ఏడాది చివరలో ఏడోసారి ఎన్నికలను ఎదుర్కొబోతున్నది. వరుసగా ఆరుసార్లు గెలిచినప్పటికీ వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని జంకుతున్నది.
దీనికి కారణం లేకపోలేదు. గత అసెంబ్లీ (2017) ఎన్నికలలో బీజేపీ ఆశించినంత మెజార్టీ సాధించలేకపోయింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 182 సీట్లకుగాను 127 సీట్లు దక్కించుకున్న బీజేపీ, గత అసెంబ్లీ ఎన్నికలలో బొటాబొటిగా 99 సీట్లు మాత్రమే గెలుచుకున్నది. కాంగ్రెస్ 77 సీట్లను గెలుచుకొని గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీకి గట్టి పట్టున్న గుజరాత్లో బొటాబొటీ సీట్లు దక్కడంతో ఈ ఏడాది చివరలో జరుగబోయే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నది. పైగా ఈ రాష్ట్రం పార్టీ అగ్రనేతలు, కేంద్ర ప్రభుత్వ అధినేతల సొంత రాష్ట్రం కావడంతో బీజేపీకి మరింత ప్రతిష్ఠాత్మకంగా మారింది. హిమాచల్‌ప్రదేశ్ కూడా బీజేపీకి అత్యంత కీలకమైనదే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం ఇది. కాగా 1990 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలను విశ్లేషిస్తే హిమాచల్‌ప్రదేశ్‌లో రెండోసారి ఏ పార్టీ కూడా గెలువలేదు. పంజాబ్, ఢిల్లీ రాష్ర్టాలలో పాగా వేసిన అమ్ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో పోటీకి సన్నద్ధం అవుతున్నది. గతంలో కాంగ్రెస్-బీజేపీకి ముఖాముఖిగా జరిగిన ఎన్నికలలో బీజేపీ గట్టెక్కినప్పటికీ, త్రిముఖ పోటీలో విజయం సాధించడం ఆషామాషీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

వచ్చే ఏడాది ఐదు రాష్ర్టాలకు ఎన్నికలు
వచ్చే ఏడాది ఐదు రాష్ర్టాలు మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటకలో అధికారాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ను గద్దె దింపి అధికారంలోకి రావడం ఎంత మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ రెండేండ్లు తిరగకముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య వర్గం ఇచ్చిన మద్దతుతో దొడ్డిదారిన బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది. కర్ణాటకలో ఇదే రీతిన కాంగ్రెస్‌లో తిరుగుబాటును ప్రోత్సహించి గద్దెనెక్కింది.
గుజరాత్
అసెంబ్లీ ఎన్నికలు (2017)
మొత్తం సీట్లు 182
బీజేపీ 99
కాంగ్రెస్ 77
హిమాచల్‌ప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు (2017)
మొత్తం సీట్లు 68
బీజేపీ 44
కాంగ్రెస్ 21
రాజస్థాన్
అసెంబ్లీ ఎన్నికలు (2018)
మొత్తం సీట్లు 200
కాంగ్రెస్ 100
బీజేపీ 73
ఛత్తీస్‌గఢ్
అసెంబ్లీ ఎన్నికలు (2018)
మొత్తం సీట్లు 90
కాంగ్రెస్ 68
బీజేపీ 15
మిషన్ సౌత్ ఇండియా
దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో కూడా గెలుపొందుతామని ప్రగల్భాలు పలుకుతున్నది. తెలంగాణలో 2018లో జరిగిన ఎన్నికలలో 119 స్థానాలకుగాను 88 స్థానాలో గెలుపొందిన టీఆర్ఎస్ రెండో దఫా అధికారం దక్కించుకుంది. బీజేపీకి అన్ని స్థానాలలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లభించక పోగా.. ఒకేఒక్క స్థానాన్ని మాత్రం గెలుచుకోగలిగింది. వందకుపైగా సీట్లలో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. అయినప్పటికీ వచ్చే ఎన్నికలలో తమదే అధికారమని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది.