హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు భద్రతలేని సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల ధర్మన్గౌడ్ డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఆదివారం యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్ ఉద్యోగులు ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్షతో సెప్టెంబర్ 1న బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను నిర్వహిసున్నట్టు ఆయన వెల్లడించారు.
సీపీఎస్ రద్దుచేసే వరకు రాజీలేని పోరాటాలు చేస్తామని స్పష్టంచేశారు. సెప్టెంబర్ 1న నిర్వహించే ఆత్మగౌరవ సభకు ఉద్యోగులు భారీగా హాజరై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడు కే రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్, లెక్కల వీరేశం, మంగ నర్సింహులు, మారం లింగారెడ్డి, లింగం శ్రీనివాస్, కృష్ణారావు, నాగన్న, శోభన్, రాందాసు, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.