హైదరాబాద్, జూలై16 (నమస్తే తెలంగాణ): గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మెంబర్ సెక్రటరీ అళగేషన్పై కేంద్రజల్‌శక్తిశాఖ వేటు వేసింది. మెంబర్ సెక్రటరీ హోదా నుంచి టెక్నికల్ మెంబర్‌గా డిమోట్ చేసింది. ఇక టెక్నికల్ మెంబర్‌గా ఉన్న ఆర్కే కనోడియాకు మెంబర్ సెక్రటరీగా ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అళగేషన్ డిమోషన్పై నీటిపారుదల శాఖలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆయన రాసిన లేఖ ఫలితమే ఈ డిమోషన్ అనే చర్చ జరుగుతున్నది. తెలంగాణ గోదావరి జలాలను తన్నుకుపోయేలా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. బనకచర్ల ప్రాజెక్టుపై అభిప్రాయాలను తెలపాలని కేంద్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏతోపాటు, కృష్ణా, గోదావరి రివర్‌బోర్డులకు, అన్ని రాష్ర్టాలకు సూచించింది.
పీఎఫ్ఆర్ రిపోర్టు కాపీని పంపింది. ఈ క్రమంలో బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై జీఆర్ఎంబీ ఇటీవల తన పరిశీలనలను సీడబ్ల్యూసీకి పంపింది. పరోక్షంగా ప్రాజెక్టు అనుమతులివ్వకూడదని వెల్లడించింది. జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీగా ఉన్న అజగేశన్ లేఖను కేంద్రానికి పంపించారు. ఇందులో పలు అభ్యంతరాలను వ్యక్తంచేశారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును చేపడితే పోలవరం ప్రాజెక్టుకు టీఏసీని (టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ) మళ్లీ తీసుకోవాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సామర్థ్యాలన్నీ మారిపోతాయని, కాబట్టి అందుకు అన్ని రాష్ర్టాల అనుమతి మళ్లీ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు, ప్రస్తుతం ప్రతిపాదించిన పనులకు ఏమాత్రం పొంతన ఉండబోదని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా డిజైన్లను మార్చాల్సి ఉందని, కాలువ సామర్థ్యం కూడా పూర్తిగా మార్చాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే, గోదావరిలో వరద జలాలు ఎన్ని, మిగులు జలాలు ఎన్ని అనేది తేల్చాల్సి ఉంటుందని, వరద జలాల గుర్తింపు, తరలింపుపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు.
ఆయా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాక ముందుకు పోవాల్సి ఉంటుందని బోర్డు తెలిపినట్టు సమాచారం. లేదంటే రాష్ర్టాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముంటుందని కూడా బోర్డు ఆ లేఖలో పేర్కొంది. ఇలా బనకచర్ల ప్రాజెక్టును దాదాపు వ్యతిరేకించింది. దీనికి జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ అళగేశన్ కారణమనే అభిప్రాయం ఏపీ నేతల్లో నెలకొన్నట్టుగా తెలిసింది. దీంతో బనకచర్లకు అడ్డుపడుతున్న ఆయన్ను తొలగించాలని కేంద్రం వద్ద పట్టుపట్టినట్టు సమాచారం. అయితే బోర్డు నుంచి పూర్తిగా తొలగిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో ఆయన్ను కీలకమైన మెంబర్ సెక్రటరీ స్థానం నుంచి డిమోషన్ ఇచ్చినట్టు సమాచారం.