హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా మూడ్రోజులపాటు సాగిన బయోఏషియా-2023 సదస్సు ఆదివారం ముగిసింది. ముచ్చెర్ల ఫార్మా సిటీ, జీనోమ్ వ్యాలీ, డివైజ్ పార్కుల గురించి ప్రచారం చేయటం ద్వారా అనేక అంతర్జాతీయ ఫార్మా, మెడ్‌టెక్, బయోటెక్ కంపెనీల దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని బయో ఏషియా సీఈవో శక్తి నాగప్పన్ తెలిపారు. ఎన్నో కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అమలు చేస్తున్న ప్రణాళికలే ఈ రంగంలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతున్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో వివిధ కంపెనీల ప్రతినిధులు, విజిటర్లు కలిపి 5,600 మంది పాల్గొన్నారు. 175 ఎగ్జిబిటర్లతో ట్రేడ్ సెంటర్‌ను ఏర్పాటు చేయగా, ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రోజుకు దాదాపు 1,100 మంది చొప్పున రెండున్నర రోజుల్లో 2,300 మందికి పైనే సందర్శించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో 2015 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వీరిలో 50కి పైగా దేశాల నుంచి ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఉన్నట్టు వెల్లడించారు.
తెలంగాణపై విదేశీ కంపెనీల ఫోకస్
కరోనా కంటే ముందు నిర్వహించిన ఎడిషన్ల కంటే 20వ ఎడిషన్ ఎంతో ప్రత్యేకమైనదిగా నిర్వహకులు తెలిపారు. అంచనాలకు మించి కంపెనీల ప్రాతినిధ్యం వహించాయని, లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంవల్లే ఈ స్థాయిలో స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ఈసారి పదుల సంఖ్యలో విదేశీ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో విదేశీ ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్, ఆర్ అండ్ డీ కంపెనీల దృష్టి తెలంగాణపై పడిందని అధికారులు చెప్పారు. సదస్సు చివరి రోజైన ఆదివారం ఉదయం నుంచే స్టార్టప్ కంపెనీల నిర్వహకులు, ఇన్వెస్టర్ల రాకతో ట్రేడ్ సెంటర్ సందడిగా మారింది. ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, బయో ఏషియా సదస్సు సీఈవో శక్తి నాగప్పన్ దగ్గరుండి సదస్సు వ్యవహారాలను చూసుకొన్నారు.
ఫార్మా, ఐటీ రంగాల మధ్య గ్యాప్‌ను గ్రహించా…
గత నాలుగు ఎడిషన్ల కంటే 20వ ఎడిషన్ బయో ఏషియా సదస్సు ఆసక్తికరంగా ఉన్నది. పీసీఎల్, హార్లాండ్, జుబిలెంట్ వంటి దిగ్గజ కంపెనీలు రావడం ఫార్మా రంగంలో ఇక్కడ ఉన్న అవకాశాలకు నిదర్శనం. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించిన ఇలాంటి సదస్సులతో స్టార్టప్ కంపెనీలకు మెరుగైన అవకాశాలు దొరుకుతాయి. ఈ సదస్సు ద్వారా ఫార్మా, ఐటీ రంగాల మధ్య గ్యాప్‌ను గ్రహించాను. ఈ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వినియోగం చాలా తక్కువగా ఉన్నది. ఫార్మా రంగంతో ఐటీని ఇంటిగ్రేట్ చేయగలిగితే పనిభారం తగ్గడంతోపాటు కచ్చితత్వంతో కూడిన ప్రొడక్షన్ వాల్యూను పెంచేందుకు అవకాశం ఉంటుంది.
– సురేంద్ర మోహన్ జూటూరు,సురేన్స్ ఇన్ఫోటెక్ డైరెక్టర్
అంతర్జాతీయ వ్యాపారానికి బయో ఏషియా వేదిక
మూడ్రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన బయో ఏషియా సదస్సు ఫార్మా, ఫార్మా అనుబంధ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార విస్తరణకు వేదికగా మారింది. తెలంగాణలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగానికి ఉన్న డిమాండ్, వ్యాపార విస్తరణకు ఉన్న అవకాశాలు ఎన్నో కంపెనీలను ఆకట్టుకొంటున్నాయి. గతంలో నిర్వహించిన సదస్సుల కంటే ఈసారి ఫార్మా, బయోటెక్, టెక్ రంగాల్లోని గ్లోబల్ లీడర్ల ప్రాతినిధ్యం పెరిగింది.
– శక్తి నాగప్పన్, బయోఏషియా సీఈవో