హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గాంధీనాయక్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిరుడు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు.
అప్పటి పరిస్థితుల ఆధారంగా నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఓ యాక్ట్‌ను తీసుకొచ్చి, ఆ తర్వాత మళ్లీ ఆ యాక్ట్‌ను సడలించి ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న తల్లిదండ్రులు పోటీ చేసే అవకాశాన్ని కల్పించారని గుర్తుచేశారు. జనాభా తగ్గిపోవడం వల్ల మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కకు పలుమార్లు వినతి పత్రాలు సైతం అందించినట్టు పేర్కొన్నారు.
రూ.5 లక్షలు సీజ్
వంగూరు, అక్టోబర్ 4 : నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు చౌరస్తా వద్ద ప్రధాన రోడ్డుపై రూ.5 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో శనివారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్‌కు కారులో వెళ్తున్న ధన్రాజు వద్ద రూ.2.80 లక్షలు, మరో కారులో రాజు వద్ద రూ.2.20 లక్షలు సీజ్ చేసినట్టు ఎస్సై మహేశ్ తెలిపారు.