హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘స్థానిక’ సమరంలో కమలం పార్టీ బోర్లా పడింది. మూడు విడతల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ కనీస పోటీ ఇవ్వకుండానే చతికిలపడింది. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. ఎక్కడా ప్రభావం చూపలేక చేతులెత్తేసింది. మూడు విడతల్లో స్వతంత్ర అభ్యర్థులకు వచ్చిన సీట్లలో సగం కూడా గెలువలేకపోయింది. మూడు విడతల్లో మొత్తం 12,735 సర్పంచ్ స్థానాలకు, 1205 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 21 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 5 స్థానాల్లో ఎన్నికలు నిలిపివేశారు. బీజేపీ కేవలం 637 స్థానాల్లో మాత్రమే గెలువడంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి ఏ పాటిదో తేలిపోయింది. స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన 1654 స్థానాల్లో కనీసం సగం కూడా బీజేపీకి రాకపోవడం ఆ పార్టీ దయనీయస్థితికి అద్దం పడుతున్నది.
మూడు విడతల్లో బీజేపీ పతనం ఇలా..
మొదటి విడతలో మొత్తం 4,236 స్థానాల్లో బీజేపీ కేవలం 182 స్థానాల్లో మాత్రమే గెలిచింది. రెండో విడత ఎన్నికలు జరిగిన 3,911 స్థానాల్లో కేవలం 236 స్థానాలకే పరిమితమైంది. మూడో విడత ఎన్నికలు జరిగిన 4,158 స్థానాల్లో 220 స్థానాలనే దక్కించుకోగలగడంతో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు ఏపాటిదో తేలిపోయింది. అర్బన్ పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ఏకంగా డిపాజిట్ కోల్పోయింది. గ్రామాల్లోనూ గల్లంతైంది