హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసు ఆరోగ్య భద్రతా పథకానికి మళ్లీ సుస్తీ చేసింది. ఈసారి కూడా భారీగా నిధులు పెండింగ్‌లో ఉండటం, చెల్లించలేక ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో కథ మొదటికి వచ్చింది. ఈనెల 31 వరకూ తమకు బకాయిలు ఇవ్వకపోతే పోలీసులకు అందించే వైద్యం నిలిపివేస్తామని సూచనప్రాయంగా చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిరుడు ఆగస్టు నుంచి ఆరోగ్యభద్రతను ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు పోలీసుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
పోలీసు ఆరోగ్య భద్రత కింద రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఏబీహెచ్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలు 14, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వంటి 150కి పైగా ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు అందాల్సి ఉన్నది. వీటిలో కొన్ని దవాఖానలకు నిర్వహణ భారం ఎక్కువ కావడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు విడుదలకాక ఆరోగ్యభద్రతా కార్డు అంటేనే వైద్యం చేయలేమని చెబుతున్నారు. పలు ఎమర్జెన్సీ సందర్భాల్లో అప్పు చేసి మరీ వైద్యం చేయిస్తున్న ఘటనలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల ఆరోగ్యభద్రతకు ప్రత్యేకంగా కమిటీ ఉన్నా నిధుల విడుదల విషయంలో మాత్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదని వాపోతున్నారు. కాగా, ఏడాది కిందట ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావు సకాలంలో వైద్యం అందక చనిపోయిన విషయం తెలిసిందే.
పెండింగ్ రూ.300 కోట్లు
పోలీసు ఆరోగ్య భద్రత ద్వారా ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తం రూ.300 కోట్ల వరకూ పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. అంత పెద్దమొత్తం పెండింగ్‌లో ఉంటే ప్రభుత్వం ప్రతినెలా కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఇస్తున్నట్టు, అదీకూడా కొన్ని పెద్ద ఆపరేషన్లు చేస్తున్న ఆసుపత్రులకే వెళ్తున్నాయని, చిన్నా చితకా వైద్యం అందిస్తున్న వాటికి నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లోనే ఉంటున్నాయని నెట్వర్క్ దవాఖానల ప్రతినిధులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే బకాయిలు సమానంగా పంచాలని, లేదంటే ఆ మాత్రం సర్వీసు ఇవ్వలేమని చెబుతున్నారు.
తీవ్ర అసహనం
ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించిన 24/7 స్పందించేలా ఒక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని పోలీసులు, వారి కుటుంబసభ్యులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. తమ రక్షణ, ఆరోగ్య భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తమను గాలికి వదిలేయడంపై సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా, పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ ఏరియర్స్, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, టీఏలు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని అయోమయంలో ఉన్నామని వాపోతున్నారు.