హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలోని మిల్లింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. తమ సమస్యలను పట్టించుకోకుండా తిరిగి తమపైనే అభాండాలు వేయడమేమిటని ప్రశ్నించారు. కొందరు తమపై పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఏడింతలు పెరిగినా రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా సకాలంలో ధాన్యం మిల్లిం గ్, బియ్యం సరఫరా చేస్తున్న తమను దొంగలుగా చిత్రీకరించడంపై మిల్లర్లు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. మంగళవారం రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా గంప నాగేందర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ఎఫ్‌సీఐ కక్ష పూరిత వైఖరే కారణమని విమర్శించారు.
చిన్నచిన్న అంశాలకు కొర్రీలు పెడుతూ సీఎమ్మార్ బియ్యం తీసుకోకుండా తిరస్కరిస్తున్నదని ఆరోపించారు. గోదాముల్లో నిల్వకు అవకాశం ఇవ్వటంలేదని, పైగా తామే సకాలంలో సీఎమ్మార్ ఇవ్వడం లేదంటూ నిం దలు వేస్తున్నదని మండిపడ్డారు. ఎఫ్‌సీఐ డిమాండ్ మేరకు తాము రా రైస్ సరఫరా చేసి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇతర రాష్ర్టాలకు తరలించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం గోదాము ల్లో నిల్వ ఉన్న 13 లక్షల టన్నుల బియ్యం లో 11 లక్షల టన్నులు రా రైస్ ఉన్నదని తెలిపారు. గత నెల 180 వ్యాగన్ల బియ్యం తరలించిన ఎఫ్‌సీఐ, ఈ నెలలో కేవలం 80 వ్యాగన్లనే తరలించిందని చెప్పారు. దీంతో గోదాముల ముందు తమ లారీలు వారంపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. 3 నెలల క్రితం సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ రైస్‌లో కెర్నల్స్ నాణ్యత లేదంటూ ఇప్పుడు తిరస్కరించిందని, ఇది కక్షసాధింపు చర్యేనని ధ్వజ మెత్తా రు. యాసంగిలో తెలంగాణ ధాన్యం బాయిల్డ్ రైస్‌కు అనుకూలంగా ఉంటుందని, ఎఫ్‌సీఐ మాత్రం రా రైస్ కావాలని అడుగుతున్నదన్నారు. అధికంగా వచ్చే నూకశాతం నష్టంపై ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేశారు.
మేం దొంగలమా?
మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడంపై గంప నాగేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. తేమ, తరుగు పేరుతో కోతలు పెడుతూ దోచుకుంటున్నారన్న విమర్శలను ఆయన తిరస్కరించారు. రైతులకు ఇబ్బంది కలుగొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ భరోసాతో తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకొన్నామని తెలిపారు. తడిసిన ధాన్యంతో అవుట్ టర్న్ రేషియో రాదని, ప్రతి క్వింటాలుకు సుమారు 10 కేజీల బియ్యం తాము నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. అయినప్పటికీ తాము తడిసిన ధాన్యాన్ని తీసుకొన్నామని గుర్తుచేశారు. ఎఫ్‌సీఐ వైఖరితో మిల్లుల్లో 1.10 కోట్ల టన్నుల బియ్యం నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. ధాన్యం దించుకొనేందుకు స్థలం లేకపోయినప్పటికీ రైతులకు ఇబ్బంది కలుగొద్దన్న కారణంతోనే ప్రైవేటు గోదాములు అద్దెకు తీసుకొని నిల్వ చేసుకొన్నామని వెల్లడించారు.
అక్టోబర్ నుంచి మళ్లీ కొత్త పంట రాబోతున్నదని, ఆ ధాన్యం దించుకొనేందుకు మిల్లుల్లో ఏమాత్రం స్థలం లేదని చెప్పారు. ఇప్పటికైనా మిల్లర్లపై ఆరోపణలను ఆపాలని కోరారు. మిల్లింగ్ పరిశ్రమలో భారీ లాభాలుంటే అదేస్థాయిలో మిల్లులు ఎందుకు పెరగలేదో అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తాము తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఒకరిద్దరి తప్పులను మొత్తం ఇండస్ట్రీకి ఆపాదించడం సరికాదని హితవు పలికారు. తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పని చేస్తున్నామని, ఏకపక్షంగా ఎవరి పక్షాన నిలువలేదని పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగి ఉంటే తమకు రాష్ట్రం రూ.700 కోట్లు, కేంద్రం రూ.700 కోట్లు బకాయి ఉన్నాయని, వాటిని తెప్పించుకొనే వాళ్లమే కదా? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆరే మా ధైర్యం
సీఎం కేసీఆర్ తీసుకొన్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని గంప నాగేందర్ అన్నారు. 2014లో 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ప్రస్తుతం అది 1.41 కోట్ల టన్నులకు పెరిగిందని తెలిపారు. తొమ్మిదేండ్లలో ధాన్యం కొనుగోలు ఆరింతలు పెరిగినప్పటికీ ఎక్కడా ఆలస్యం చేయకుండా సకాలంలో ఎఫ్‌సీఐకి సీఎమ్మాఆర్ అందిస్తున్నట్టు చెప్పారు. ఎఫ్‌సీఐ నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. సీఎం కేసీఆర్ ఉన్నారనే ధైర్యంతోనే ముందుకెళ్తున్నామని అన్నారు. తామూ వ్యవసాయంలో భాగమేనని, రైతుల మేలు కోసం తామంతా పని చేస్తున్నామని పేర్కొన్నారు. యాసంగి పంటను నూక శాతం తేల్చకపోయినప్పటికీ రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బంది కావొద్దనే ఉద్దేశంతో ధాన్యాన్ని దించుకొన్నట్టు తెలిపారు. ఇకనైనా ఎఫ్‌సీఐ కక్షసాధింపు చర్యల్ని ఆపేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే గోదాములు ఖాళీ చేసి స్టోరేజీకి అవకాశం కల్పించి బియ్యం తీసుకోవాలని కోరారు. మిల్లింగ్ సామర్థ్యం లేదనే ఆరోపణలను ఆయన ఖండించారు. తమకు ప్రతినెలా 7-8 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేసే సత్తా ఉన్నదని, ఎలాంటి కొర్రీలు లేకుండా ధాన్యం దించుకోవాలని ఎఫ్‌సీఐకి సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పలు జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు.