నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ ఆర్‌పై తాజాగా రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఓ వైపు నిత్యం ఢిల్లీకి వెళ్లి ట్రిపుల్ ఆర్ వేగవంతం చేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసే కోమటిరెడ్డి.. బాధిత రైతుల వద్దకు వచ్చే సరికి మాత్రం ‘అది అయ్యేదా.. పొయ్యేదా?’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి ఇప్పట్లో కానిదానికి ఎందుకు అలైన్మెంట్ హడావుడి అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసేందుకు మినిస్టర్స్ క్వార్టర్స్‌కు వెళ్లారు. చాలా సేపటి తర్వాత బయటకు వచ్చిన మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకొనేందుకు ప్రయత్నించారు.
‘సార్ మేము పుట్టపాక నుంచి వచ్చినం.. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్తో మా భూములు పోతున్నయి’ అని వినతిపత్రం ఇవ్వగా దాన్ని తీసుకొని చూడకుండానే పీఏకు ఇచ్చి మంత్రి ముందుకు కదిలారు. సార్ ఒక్క నిమిషం అంటూ రైతులు వెంటపడి విషయం చెప్తుండగా ‘అసలు మీరెందుకొచ్చారు? ట్రిపుల్ ఆర్ అయ్యేదా? పొయ్యేదా? వచ్చినా అది ఇప్పట్లో కాదు. ఇప్పటికీ భువనగిరి దగ్గర రాయగిరి నుంచి పోయే ఉత్తరభాగానికే అతీగతీ లేదు. ఇక మీ వైపు ఇప్పట్లో అయ్యేది కాదు.. పొయ్యేది కాదు. అది అయ్యే సరికి నేనుంటనో.. నువ్వుంటవో తెల్వదు. తరాలు మారాల్నో.. ఎన్ని ప్రభుత్వాలు మారాల్నో కూడా తెల్వదు.
మీ భూములు మీరు దున్నుకొని బతుకుపోండ్రి. ఒక వేళ భూములే పోతే నల్లగొండలో నేను బైపాస్ రోడ్డు వేస్తున్న. అక్కడ కోటీ, కోటిన్నర ఇస్తున్న. అప్పటి వరకు నేనుంటే ఇక్కడ కూడా అట్లనే వస్తుయి పోండ్రి’ అంటూ కోమటిరెడ్డి ఈసడించుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ట్రిపుల్ ఆర్ బాధితుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ‘మంత్రి చెప్పేదే నిజమైతే అసలు ఇప్పట్లో కాని ట్రిపుల్ ఆర్ కోసం అలైన్మెంట్ ప్రకటన ఎందుకు?, ఎందుకింత రాద్ధాంతం?’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సారవంతమైన భూముల్లో ఏండ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న తమ జీవితాల్లో కల్లోలం రేపడం ఎందుకని నిలదీస్తున్నారు.
అలైన్మెంట్ ప్రకటన వచ్చినప్పటి నుంచి కంటినిండా నిద్రలేదని, కడుపు నిండా తిండి కరువైందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో నిత్యం సీఎం రేవంత్‌రెడ్డి పక్కన కూర్చొని ట్రిపుల్ ఆర్ త్వరలో పూర్తి.. పనులు వేగవంతం అంటూ ప్రకటనలు చేసే కోమటిరెడ్డి ఇలా యూటర్న్ ప్రకటనలు చేయడమేంటని వాపోతున్నారు. గత నెల 30న హెచ్ఎండీఏ విడుదల చేసిన ప్రాథమిక అలైన్‌మెంట్‌పై రైతులు మార్నాటి నుంచే ఆందోళనకు దిగారు. దక్షిణ భాగం రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసేందుకు పలుమార్లు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ నెల 13న నల్లగొండకు తేరటుపల్లి గ్రామ రైతులొస్తే వారిని మంత్రి దరిదాపుల్లోకి రానివ్వకుండా అరెస్టు చేశారు. ముందు తెలిస్తే అరెస్టు చేస్తారని గుట్టుచప్పుడు కాకుండా మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌కు పుట్టపాక రైతులు చేరుకున్నారు. మంత్రి బయటకొచ్చేటప్పుడు విషయం చెప్పబోతే ఆయన దాటవేత వ్యాఖ్యలు వారిలో ఆగ్రహం తెప్పించింది.