హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు తీవ్రమైనవని, తీవ్ర నేరాభియోగమని రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి ఇవ్వాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ, నిందితుల పిటిషన్లను విచారణకు అనుమతిస్తూ న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం వెలువరించిన 98 పేజీల తీర్పు సర్టిఫైడ్ కాపీ బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను ప్రజలకు సీఎం కేసీఆర్ వివరించటం అర్థం చేసుకోదగినదేనని తీర్పులో పేర్కొన్నది.
ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు, జరుగుతున్న సంఘటనల గురించి మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలన్న ప్రయత్నాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. మీడియా సమావేశంలో ప్రధాని, కేంద్ర హోం మంత్రి పేర్లు సీఎం చెప్పినందున కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలన్న బీజేపీ వాదన సరికాదని తేల్చిచెప్పింది. కేసులోని కీలక సాక్ష్యాధారాలకు సంబంధించిన వీడియోలు లీక్ కావడం వల్ల సిట్ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తున్నామని తెలిపింది. జీవో 268 ప్రకారం ఏసీబీ పోలీసులు దర్యాప్తు చేయాల్సిన కేసు సాధారణ పోలీసులు దర్యాప్తు చేయడం చెల్లదని పేర్కొన్నది. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే జీవో 63 ద్వారా ఏర్పాటైన సిట్‌ను రద్దు చేస్తున్నట్టు తీర్పులో ధర్మాసనం తెలిపింది.
నేడు సిట్ అప్పీల్!
సింగిల్ జడ్జి తీర్పు సర్టిఫైడ్ కాపీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సిట్ గురువారం ఆ తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్ చేయనున్నది. క్రిమినల్ కేసు దర్యాప్తు దశలో కోర్టులు అడ్డుకొనేందుకు ఆసాధారణ పరిస్థితులు ఉండాలని, ఈ కేసులో అలాంటిదేమీ లేదని సిట్ వాదించనున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాలని నిందితులు బెదిరించారని, ఆ విధంగా చేయకపోతే ఈడీ,సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల నుంచి కేసుల విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా భయపెట్టినట్టు, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై ఈడీ తాజా కేసే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలుపనున్నట్టు సమాచారం.