Assistant Professors | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ‘స్క్రీనింగ్ టెస్టు’ విధానం రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతిభకు పాతర వేసి.. అనుభవం, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 4న జీవో 21ని దొడ్డిదారిలో విడుదల చేసింది. అకడమిక్ రికార్డు, రీసెర్చ్ వెయిటేజీకి 50, డొమైన్ పరిజ్ఞానంతోపాటు టీచింగ్ నైపుణ్యాల వెయిటేజీకి 30, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. మొత్తం 100 మార్కులలో మెరిట్ మార్కుల ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు 1:5 నిష్పత్తి ప్రకారం పిలుస్తారు.
జీవోలో రూల్ ఆఫ్ రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వలేదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి లైన్ క్లియర్ చేసింది కానీ.. రిజర్వేషన్ల అంశంపై మాత్రం జీవోలో ప్రస్తావించలేదు. యూనివర్సిటీలో మొత్తం పోస్టులకు కలిపి రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు అమలు చేస్తారా? లేక డిపార్లుమెంట్లవారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు అమలు చేస్తారా? అన్న అంశంపై స్పష్టత లేదు.
దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్టారెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ వివరణ కోరగా యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జోలికి ప్రభుత్వం వెళ్లలేదు. అన్ని యూనివర్సిటీల్లో 2,060 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ఎప్పుడూ మోక్షం లభిస్తుందోనని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.