Kamareddy | లింగంపేట: రైతుభూమిలో ఎర్రజెండాలు..! అయితే వీటిని పాతింది ప్రభుత్వమే. పంట రుణాల వసూలుకు కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు.. రైతులను దారుణంగా అవమానిస్తున్నారు. తాజాగా ఓ రైతు అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్యాంకు అధికారులు ఎర్రజెండాలు పాతారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేకు చెందిన రైతు రాజశేఖర్‌రెడ్డి మండల కేంద్రంలోని సహకార బ్యాంకులో తన భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు. సకాలంలో అప్పు చెల్లించకపోవడంతో సొసైటీ అధికారులు రికవరీకి దిగారు. పంట దిగుబడి రాలేదని, ప్రభుత్వ సాయమూ అందలేదని ఎంత చెప్పినా వినలేదు.
అసలు, వడ్డీతో కలిపి రూ.7.86 లక్షలు కావడంతో రైతు భూమిని వేలం వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ భూపాల్‌రెడ్డి, స్థానిక బ్యాంకు మేనేజర్ కుమారస్వామి ఆధ్వర్యంలో బ్యాంకు సిబ్బంది గురువారం ఆయన పొలంలో ఎర్రజెండాలు పాతారు. 20వ తేదీన భూమిని వేలం వేయనున్నట్టు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు.