హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీ వ్యవహారం మొదటికొచ్చింది. ఈ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ తాజాగా నాలుగో నివేదికను విద్యాశాఖకు పంపింది. కానీ, ఈ నివేదికలోనూ లోపాలున్నాయని, న్యాయ, విద్యా శాఖల వాదనలను స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 69 మంది జిల్లా స్థాయి క్రీడాకారులు (ఫారం-2 వారు) కూడా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అర్హులేనని తాజా నివేదికలో స్పోర్ట్స్ అథారిటీ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నివేదికను చూ సి విద్యాశాఖ అధికారులు నివ్వెరపోయా రు.
రాష్ట్రస్థాయి, ఇంటర్ వర్సిటీ క్రీడాకారులను పక్కనపెట్టి జిల్లా స్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలివ్వడమేంటని తలలుపట్టుకుంటున్నారు. 2024 డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా టీచర్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు విద్యాశాఖకు, స్పోర్ట్స్ అథారిటీ మధ్య పంచాయితీకి దారితీసింది. దీంతో 36 మందిని అర్హులుగా, మరో 363 మందిని అనర్హులుగా తేల్చా రు. ఆ తర్వాత ఈ వ్యవహారం హైకోర్టుకు, లోకాయుక్తకు చేరడంతో 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఆ తర్వాత నుంచి రెండు శాఖల అధికారులు వేర్వేరు మార్గాల్లో పయనిస్తూ తప్పు మీదంటే మీదేనని ఒకరిపై మరొకరు నెపాన్ని వేసుకుంటున్నారు. దీంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడంలేదు.
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన జీవో 74కు విరుద్ధంగా నియామకాలు జరపడం, తాము చేసిందే సరైనదని స్పోర్ట్స్ అథారిటీ అధికారులు వాదిస్తుంటంతో ఏమీ పాలుపోక విద్యాశాఖ అధికారులు అడ్వకేట్ జనరల్ న్యాయసలహాను తీసుకున్నారు. ఆ తర్వాత 25 మందికి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలిచ్చినట్టు నిర్ణయానికొచ్చారు. కానీ, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పాత నివేదికనే మళ్లీ పంపడంతో కథ మొదటికొచ్చింది. దీంతో స్పష్టత కోసం ఈ నివేదికను విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపనున్నారు. అనంతరం అది జీఏడీకి వెళ్లనుంది. జీఏడీ నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనైనా ఈ చిక్కుముడి వీడుతుందా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.