ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో రైతులు పండించిన జొన్న పంట చేతికొచ్చింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటను ఇండ్లలో నిల్వ చేసుకోలేక శివారులోని ఖాళీ ప్రదేశాల్లో ఉంచుతున్నారు. రాత్రీపగలు పంట వద్ద కాపలా ఉంటున్నారు. వర్షం పడితే పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జొన్న కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో గురువారం రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. తొగుట వ్యవసాయ మార్కెట్లో 3,300 క్వింటాళ్లు పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేసి, మార్చి 21 నుంచి కొనుగోళ్లు నిలిపివేశారని, ఎక్కడ పంట అమ్మాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై రవికాంత్రావు అధికారులతో మాట్లాడి, రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం కోల్హారి గ్రామానికి చెందిన రైతు రియాజ్ఖాన్ ఏడెకరాలను కౌలుకు తీసుకుని జొన్న సాగు చేశాడు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో రెండు బోర్లలో నీళ్లు ఇంకిపోయాయి. చేతికందాల్సిన చేను ఎండిపోయింది. దీంతో గురువారం చేనులో పశువులను వదిలాడు. కౌలుకు రూ.1.50 లక్షలు, పెట్టుబడికి రూ. లక్ష ఖర్చయ్యిందని వాపోయాడు.
నాకున్న రెండున్నర ఎకరాల్లో వరి వేసిన. చివరి తడుల కోసం ఎంత తండ్లాడినా చుక్కనీరు దొరకలేదు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదు. మిత్తికి తెచ్చి పెట్టుబడి పెట్టిన. రెండున్న ర ఎకరాలు పూర్తిగా ఎండింది. ప్రభు త్వం నష్టపరిహారం ఇవ్వాలి. యాసంగిలో వరి వేసి పెద్ద తప్పు చేసిన.