హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : దేశ జనాభా పెరుగుదల, ఆహార అవసరాల దృష్ట్యా విత్తన పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రపంచ విత్తన పరిశ్రమలో భారత్ ఐదో స్థానంలో ఉన్నదని తెలిపారు. మిగతా రాష్ర్టాల కంటే విత్తన పరిశోధనలు, విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలమైన ప్రాంతమని చెప్పారు.
శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన భారత జాతీయ విత్తన సంఘం 16వ వార్షిక సమావేశంలో ‘బయోటెక్నాలజీ ద్వారా పంటల అభివృద్ధి’పై జూమ్ ద్వారా మంత్రి ప్రసంగించారు. ప్రస్తుత వాతావరణ మార్పులు, రాబోయే రోజుల్లో పోషకాహార అవసరాలు, ఉత్పాదకత పెంపు నేపథ్యంలో విత్తనరంగంలో పరిశోధనలు మరింత జరగాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిదన్నారు.
పండ్లు, పూలు, పాల ఉత్పత్తులు, చేపల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలలో దేశం మరెంతో అభివృద్ధి సాధించాలని చెప్పారు. వ్యవసాయ అభివృద్ధికి విత్తనం, దాని నాణ్యత ముఖ్యమని, ఆ దిశగా విత్తన పరిశ్రమ కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తన కంపెనీలకు ఎల్లవేళలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
విత్తన కంపెనీలు, పరిశోధకులు దీనిని ఉపయోగించుకొనేందుకు ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. దేశానికి అవసరమైన పత్తి విత్తనాలు 50 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి కావడం గర్వంగా ఉన్నదన్నారు. నాణ్యతలేని విత్తనాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత విత్తన రంగం మీద ఉన్నదని పేర్కొన్నారు.