హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : శ్రీరాంసాగర్(ఎస్సారెస్పీ) రెండోదశ ప్రాజెక్టు పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎంపీ, దివంగత భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని పలువురు పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, కవులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు కోరారు. ఎస్సారెస్పీ రెండోదశ ద్వారా ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలకు 4.40 లక్షల ఎకరాలకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భీమిరెడ్డి నర్సింహారెడ్డి పోరాడి సాధించారని గుర్తుచేశారు.
భీమిరెడ్డి ఆశయంతోనే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని కరువు నేలపైకి గోదావరి జలాలు వచ్చాయని పేర్కొన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘బీఎన్ ఆలోచనా వేదిక’ ఆధ్వర్యంలో.. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వర్దెళ్లి మురళి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో ఎస్సారెస్పీ రెండో దశ కాలువకు భీమిరెడ్డి నర్సింహారెడ్డి పేరు పెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘దేశంలో భూసంసరణల అమలుకోసం పోరాడిన భీమిరెడ్డి పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలి.
ఆ మహనీయుడి పేరుతో సూర్యాపేటలో భీమిరెడ్డి విజ్ఞాన పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలి. ఇందుకు 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాలి. ట్యాంక్‌బండ్‌పై బీఎన్ విగ్రహం ప్రతిష్ఠించాలి. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి బీఎన్ పేరు పెట్టాలి. పాఠ్యపుస్తకాల్లో బీఎన్ చరిత్రతోపాటు అలనాడు ‘భూమి కోసం.. భుక్తి కోసం’ పోరాడిన యోధుల పేర్లను సిలబస్‌లో చేర్చి మన చరిత్రను భవిష్యత్తరాలకు అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి’ అని తీర్మానించారు. ఈ తీర్మానాలను సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ప్రతిపాదించారు. ఆ తర్వాత సమావేశం ఆమోదించింది. ఈ తీర్మానాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని, ఇందుకు జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని కోరారు.
తెలంగాణ సాధన స్ఫూర్తిని మరిచిన పాలకులు : అల్లం నారాయణ
ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఎందుకోసం తెలంగాణ సాధన ఉద్యమం జరిగిందో ఆ స్ఫూర్తిని పాలకులు విస్మరించడం విచారకరమన్నారు. ‘తెలంగాణ చరిత్రను, సంస్కృతిని మరచిపోయారు. తెలంగాణతల్లి రూపురేఖలు మార్చేశారు. ఇప్పుడు అంతా వ్యాపారం కోసం చర్చ జరుగుతున్నది. లాల్-నీల్ పోరాటాలకు పునాది వేసిన తాత్వికుడు బీఎన్. తెలంగాణ చరిత్రను మనం కాపాడుకోకపోతే, అది మన కండ్లముందే కనుమరుగవుతుంది. ఇది తెలంగాణకు విషాదకరం’ అని పేర్కొన్నారు.
అనంతరం సీనియర్ సంపాదకుడు కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. బీఎన్ పేరున అలనాటి త్యాగధనుల చరిత్రను నిలబెట్టే స్మారక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, ఇందుకోసం ఆలోచనాపరులంతా కదలిరావాలని పిలుపునిచ్చారు. సీనియర్ సంపాదకుడు టంకశాల అశోక్ మాట్లాడుతూ.. గోదావరి జలాల కోసం కృషి చేసిన వారిని ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ఎస్సారెస్పీకి బీఎన్ పేరు పెట్టాలని అడగాల్సిన దుస్థితి తెలంగాణ అస్తిత్వానికి మాయనిమచ్చ అని, ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ జలాల కోసం బీఎన్ పోరాడితే, ఆ వరద కాలువకు దామోదర్‌రెడ్డి పేరు పెట్టడం చరిత్రకు అన్యాయం చేసినట్టేనని, ఇందుకోసం పౌర సమాజంతోపాటు కమ్యూనిస్టుల నుంచి బలమైన ప్రతిపాదనలు రావాలని కోరారు.
సీని యర్ సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడు తూ.. ఈ నేలపై జరిగిన వీరోచిత పోరాటాల వీరుల స్మరణలతో స్మారకకేంద్రం లేకపోవడం విచారకరమని, ఇందుకోసం కమ్యూనిస్టు పార్టీలు ముందుకొచ్చి డిమాండ్ చేయకపోవడం మరింత విచారకరమని పేర్కొన్నారు. జలియన్‌వాలాబాగ్ లాంటి ఘటనలు తెలంగాణలో అనేకం జరిగాయని, వాటి చరిత్రను రికార్డుచేసి భవిష్యత్తరాలకు అందించాలని కోరారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్ మాట్లాడుతూ.. బీఎన్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చడంతోపాటు సూర్యాపేట జిల్లాకు ఆయన పేరు పెట్టాలని కోరారు. హిందూ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవికాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధపోరాట చరిత్రను సిలబస్‌లో పెట్టాలన్నారు. సామాజికవేత్త వేదకుమార్ మాట్లాడుతూ.. ఎస్సారెస్పీకి బీఎన్ పేరు పెట్టడం ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు మాత్రమే కాకుండా, తెలంగాణ సమాజం బాధ్యత అని, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలన్నారు. సీనియర్ అధ్యాపకుడు కట్టా భగవంతరెడ్డి మాట్లాడుతూ.. బీఎన్ కృషిని పుస్తకరూపంలో తేవాలని కోరారు. సినీ దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భీమిరెడ్డి పేరు పెట్టాలి. భీమిరెడ్డిపై సినిమా తీసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ నేల చరిత్రను విశ్వవ్యాప్తం చేయాలి’ అని కోరారు. కార్యక్రమంలో బీఎన్ ఆలోచనా వేదిక ప్రతినిధి డేగల జనార్దన్, అడ్వకేట్ అయోధ్య, భారత జనవిజ్ఞాన వేదిక నాయకులు రమేశ్, మేకల శ్రీనివాస్, భారత విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బీఎన్ తనయుడు ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు వర్దెళ్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గొప్ప దార్శనికుడు బీఎన్: ఎమ్మెల్సీ గోరటి
ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరటి వెంకన్న మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమానికి ముందు తెలంగాణను కాపాడగలిగింది గోదావరి జలాలేనని చాటి చెప్పిన గొప్ప దార్శనికుడు బీఎన్ అన్నారు. ఆయన చరిత్రను విస్మరించడం ద్రోహమే అని పేర్కొన్నారు. ‘తరమెల్లి పోతున్నది.. ఆ త్యాగాల స్వరమాగిపోతున్నది.’ అన్న పాటను భీమిరెడ్డి కన్నుమూసినపుడు రాసినట్టు గుర్తుచేశారు. ఆయన చరిత్రను చరిత్రకే ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.