KTR | బోయినపల్లి, సెప్టెంబర్ 25: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీలోని జడ్పీ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ కొనసాగేది. పక్కా భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలలోని రెండు గదుల్లో అరకొర సౌకర్యాలతో విద్యాబోధన జరిగేది. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను స్థానిక నాయకులు.. రెండేండ్ల క్రితం కొదురుపాక పాఠశాలకు వచ్చిన అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆయన వెంటనే స్పందించి తన అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మి-కేశవరావు జ్ఞాపకార్థం సొంత ఖ ర్చులతో నూతన భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. 2022 జనవరి 10న ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కేటీఆర్ సూచన మేరకు కార్పొరేట్‌కు దీటుగా అధునాతన సౌకర్యాలు కల్పించి రెండు ఫ్లోర్లలో 18 తగరతి గదుల నిర్మాణం చేపట్టారు.
వంట గదితోపాటు డైనింగ్‌హాల్, కంప్యూటర్ గదులు, ప్రహరీ నిర్మాణాలు పూర్తి చేశారు. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతులమీదుగా పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత జోగినపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు.