హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ఇంగ్లిష్ మీడియం చదువులు.. నాణ్యమైన విద్యకు కేరాఫ్ అడ్రస్ అయిన తెలంగాణ మాడల్ స్కూల్స్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్నికోలస్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. 6వ తరగతితోపాటు, 7-10తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు http://telanganams. cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ విద్యార్థులు రూ. 200, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ శనివారం విడుదల కానున్నది. ఈనెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. విద్యార్థులు ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 9 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 19న నిర్వహిస్తారు. రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉండగా, 6వ తరగతిలో 19,400సీట్లతోపాటు, ఇతర తరగతుల్లో49వేలకు పైగా సీట్లు ఉన్నాయి.